భారతావనిలో దక్షిణా పథమున ఓరుగల్లు సమీపమునగల పరకాల పట్టణమున ప్రముఖ శైవ క్షేత్రమున శ్రీ కుంకుమేశ్వరునిగా విరాజమానమైయున్నారు.ఇట్టి క్షేత్ర పురాణ గాథగా పార్వతీ దేవి పరమేశ్వరుని కొరకు తపస్సు చేసిన కామ్యవనముగా తెలుస్తున్నది. పార్వతీ దేవి తపస్సునకు మెచ్చిన పరమేశ్వరుడు పాతాళ అగాధమునుండి ఉద్భవించి పార్వతీ దేవికి దర్శనమిచ్చి నీ హస్తమున కుంకుమ రంగరిస్తుండగా ఎరుపు వర్ణములో లింగరూపమున
స్వయo వ్యక్తముగా సుబ్రహ్మణ్యషష్ఠి రోజున ఉద్భవిస్తానని కుంకుమేశ్వరునిగా అభిషేకించి అర్చించమని అనుగ్రహించి అదృశ్యమయెను. కొంతకాలమునకు పార్వతీ దేవి స్నానమాచరించి వామహస్తమున కుంకుమను రంగరిస్తుండగా సుబ్రహ్మణ్యషష్ఠి రోజున ఎరుపువర్ణములో లింగ రూపమున ఉద్భవించగా పార్వతీదేవి సంతోషముగా శిలా పీఠమున ప్రతిష్ఠించి కుంకుమేశ్వరునిగా అర్చించెను. ఇట్టి క్షేత్రము కలియుగమున కాకతీయ రాజుల పరిపాలనలో పంట పొలముగానుండగా నాగలితో దున్నుతుండగా సుబ్రహ్మణ్యషష్ఠి రోజున నాగలికి అడ్డుతగలగా త్రవ్వి చూడగా శివలింగము దర్శనమివ్వగా ప్రక్కన ఉన్న బావిలో నీరు తెచ్చి శుద్ధి చేసి పూజించి పసుపు కుంకుమలు సమర్పించి ఇంటికి చేరుకొని సేదతీరుతుండగా ఉదయము బ్రాహ్మీ ముహూర్తమున పరమేశ్వరుడు స్వప్నమున సాక్షాత్కరించి పై గాథ తెలిపి కుంకుమేశ్వరునిగా అర్చించమని ఇట్టి క్షేత్రము సుబ్రహ్మణ్య క్షేత్రముగా విరజిల్లుతుందని సుబ్రహ్మణ్య షష్ఠి బోనము సమర్పించమని చెప్పి నీవు వెళ్ళేసరికి నీవు అర్చించి వచ్చినదంతయు కుంకుమ వర్ణముగా మారుతుందని తెలిపి అదృశ్యమవగా అట్టి వ్యక్తి స్నానమాచరించి మరలా అక్కడికి చేరుకోగా తాను సమర్పించిన ద్రవ్యము కుంకుమ వర్ణముగా దర్శమిచ్చెను.వెంటనే రాజుగారికి తెలుపగా కాకతీయ రాజులైన ప్రతాప రుద్రుడు ఆలయము నిర్మించి, రాజ్యమంతయూ కార్తిక అమావాస్య నుండి పాలు వితరణ చేయకుండా త్రాగకుండా సంరక్షించి వారము రోజులు వెన్న చేసి ప్రతి మార్గశిర శుద్ధ పంచమి రోజున ఆనతి కట్టి, సుబ్రహ్మణ్య షష్ఠి రోజున వెన్నతో బోనము సమర్పిస్తూ నాటి నుండి నేటి వరకు కుంకుమేశ్వరునిగా శైవాగమోక్తముగా నిత్యోత్సవములు,పక్షోత్సవములు ,మాసోత్సవములు ,ఆయనోత్సవములు,సంవత్సరోత్సవములు అత్యంత వైభవముగా జరుపుకుంటూ భక్తుల కొంగు బంగారమై కుంకుమయ్యగా పూజలందుకుంటున్నాడు.
Post a Comment