ఆర్డినెన్స్ తీసుక రావాలని కేబినెట్ నిర్ణయం
స్థానిక సంస్థల్లో పెరగనున్న బీసీల ప్రాతినిధ్యం
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఆర్డినెన్స్ తీసుకు రావాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించడంతో స్థానిక సంస్థల ఎన్ని కలకు లైన్ క్లియర్ అయినట్లయ్యింది. ఈ ఆర్డినెన్స్‌పై ఎవరు కోర్టును ఆశ్రయించకుంటే సెప్టెంబర్ నెలాఖరు లోగా గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు పూర్తయ్యే అవకాశాలున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన నెల రోజుల్లో రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేసి సెప్టెంబర్ నెలాఖరు వరకు ఎన్ని కలు పూర్తి చేయాలని హైకోర్టు ప్రభుత్వానికి గడువు విధించిన విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీసీ కులగణన చేపట్టి విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఇచ్చిన హామీ మేరకు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వ హణలో జాప్యం అవుతున్నది. కులగుణన చేపట్టి ఆయా కులాల లెక్క తేల్చిన ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు బీసీ డెడికేషన్ కమిషన్‌ను నియ మించింది. ఆ కమిషన్ సూచన మేరకు బీసీలకు 42 శాతం రిజర్వుషన్ కల్పించాలని నిర్ణయించి మార్చిలో అసెంబ్లీలో విద్య, ఉద్యోగాలకు ఒక బిల్లు, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లకు మరొక బిల్లును ప్రవేశ పెట్టి ఆమోదం పొందారు. ఈ బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం పంపించారు. అది ఆలస్యం అయ్యే సూచనలు ఉండడంతో 2018 పంచాయతీరాజ్ చట్టం సెక్షన్ 285 (ఏ)ను సవరించాలని నిర్ణయించింది. అలాగే ఎంపీ టీసీలు, సర్పంచ్ స్థానాలకు మండలం యూనిట్‌గా, ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాలకు జిల్లా యూనిట్‌గా, జడ్పీ చైర్మన్ స్థానాలకు రాష్ట్ర యూనిట్‌గా రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు. ఆర్డినెన్స్‌ను గవర్నర్ ఆమోదం కోసం పంపించనున్నారు. గవర్నర్ ఆమోదం తెలిపితే ప్రభు త్వం ఈ రిజర్వేషన్లకు సంబంధించి జీవోను జారీ చేయనున్నది. ఈ జీవోను సవాల్ చేస్తూ ఎవరు కూడా కోర్టును ఆశ్రయించకుండా ఉండేందుకు ముందస్తుగా కోర్టులో కేవియట్ దాఖలు చేయాలని నిర్ణయించింది.
*_ఫ రిజర్వేషన్ల పెంపుతో పెరగనున్న బీసీల ప్రాతినిధ్యం_*
బీసీల రిజర్వేషన్లను 42 శాతానికి పెంచడంతో స్థానిక సంస్థల్లో బీసీల ప్రాతినిధ్యం పెరగనున్నది. ఇప్పటి వరకు సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 శాతం రిజర్వేషన్లకు మించ రాదు. ఇందులో ఎస్సీ, ఎస్టీలకు మాత్రం జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు పోనూ మిగతా బీసీలకు కల్పిస్తూ వస్తున్నారు. 2019లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 27 శాతం, ఎస్సీలకు 17 శాతం, 6 శాతం ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించారు. జిల్లాలో 137 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, బీసీలకు 37 స్థానాలను కేటాయించారు. గ్రామ పంచాయతీలు 263 ఉండగా, 70 పంచాయతీల సర్పంచ్ స్థానాలను బీసీలకు కేటాయించారు. తక్కువ స్థానాలు కేటాయించడంతో విధి లేని పరిస్థితుల్లో ఆసక్తి గల బీసీలు జనరల్ స్థానాల్లో పోటీ చేసి గెలుపొందారు. బీసీలకు ఎంపీటీసీ స్థానాలను 37 కేటాయించినప్పటికీ, 76 స్థానాల్లో, సర్పంచ్ స్థానాలను 70 కేటాయించినప్పుటికీ 144 స్థానాల్లో గెలుపొందారు. ప్రస్తుతం 42 శాతం ప్రకారం చూస్తే 13 జడ్పీటీసీ స్థానాల్లో బీసీలకు 5 నుంచి 6 స్థానాల వరకు, ఎంపీటీసీ స్థానాలు 57, సర్పంచ్ స్థానాలు 110 వరకు కేటాయించనున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లు 70 శాతం వరకు పోతే, మిగతా 30 శాతం సీట్లను జనరల్‌కు కేటాయించనున్నారు. వాటిలో కూడా బీసీలు పోటీ చేసి తమ ప్రాతినిధ్యాన్ని పెంచుకునే అవకాశాలున్నాయి.
Post a Comment