శాయంపేట, సెప్టెంబర్ 7: రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాత మధుపై కాంగ్రెస్ పార్టీ శాయంపేట మండల అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ తాత మధును వెంటనే పదవి నుంచి తొలగించాలని, ఆయనపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
సోమవారం సాయంత్రం శాయంపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఎమ్మెల్సీ తాత మధు దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా బుచ్చిరెడ్డి మాట్లాడుతూ స్పీకర్‌పై సభ్య సమాజం తలదించుకునేలా వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో గౌరవప్రదమైన స్థానంలో ఉన్న స్పీకర్‌ను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.
తాత మధుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయాల్సిన ప్రజాప్రతినిధులు వ్యక్తిగత విమర్శలకు దిగడం సరికాదన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సర్పంచులు హింగే భాస్కర్, వాంకుడోత్ సదర్ లాల్, అల్లే రాజీరు, ఉప సర్పంచులు రావుల శ్రీనివాస్, మస్కే కుమార్, నాయకులు దుబాసి కృష్ణమూర్తి, చిందం రవి, నిమ్మల రమేష్, కుసుమ శరత్, రవిపాల్, తిరుపతి, ప్రపంచ రెడ్డి, కట్టయ్య, బాసని ప్రకాష్, మారేపల్లి రాజేందర్, వరదరాజు, రేణిగుంట్ల సదయ్య తదితరులు పాల్గొన్నారు.
Post a Comment