చిట్టీల పేరుతో రూ.5.04 కోట్లు మోసం చేసిన వ్యక్తి అరెస్టు.పరకాల ఏసీపీ సి. సతీష్ బాబు

BLN తెలుగు దినపత్రిక, శాయంపేట మార్చి 11:
చిట్టీల పేరుతో మరియు అధిక వడ్డీ ఆశ చూపిస్తూ ప్రజల నుంచి కోట్ల రూపాయలు సేకరించి తిరిగి ఇవ్వకుండా మోసం చేసిన వ్యక్తిని శాయంపేట పోలీసులు అరెస్ట్ చేసినట్లు పర్కల్ ఏసీపీ సి. సతీష్ బాబు తెలిపారు.
పోలీసుల వివరాల ప్రకారం, హనుమకొండ జిల్లా గోపాలపూర్ ప్రాంతానికి చెందిన పెరుమాండ్ల కిషోర్ (40) అనే వ్యక్తి 2011 సంవత్సరం నుంచి ప్రభుత్వ అనుమతి లేకుండా “పెరుమాండ్ల చిట్స్” పేరుతో చిట్ ఫండ్ నిర్వహిస్తూ ప్రజలను నమ్మించి డబ్బులు సేకరించేవాడు. ఈ క్రమంలో 117 మంది వద్ద నుంచి చిట్టీల పేరుతో రూ.1,49,22,000 తీసుకొని తిరిగి ఇవ్వకుండా మోసం చేశాడు.
ఈ విషయంపై పత్తిపాక గ్రామానికి చెందిన గుండారపు కిరణ్ రెడ్డి ఫిబ్రవరి 19, 2026న శాయంపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.
అదేవిధంగా అధిక వడ్డీ ఇస్తానని నమ్మబలికి మరో 59 మంది వద్ద నుంచి రూ.3,55,67,500 అప్పుగా తీసుకొని తిరిగి ఇవ్వకుండా మోసం చేశాడు. ఈ ఘటనపై పత్తిపాక గ్రామానికి చెందిన చల్లా రఘుపతి రెడ్డి మార్చి 7, 2026న పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మరో కేసు నమోదు చేశారు.
మొత్తంగా 176 మంది బాధితుల నుంచి రూ.5,04,89,500 సేకరించి మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో శాయంపేట సీఐ పి. రంజిత్ రావు, ఎస్‌ఐ జె. పరమేశ్వర్ నేతృత్వంలో నిందితుడు పెరుమాండ్ల కిషోర్‌ను అరెస్ట్ చేశారు.
నిందితుడు మోసం చేసిన డబ్బులతో భూములు, ప్లాట్లు, వ్యవసాయ భూములు, హనుమకొండ గోపాలపూర్‌లో ఇల్లు, బంగారు మరియు వెండి ఆభరణాలు, కారు కొనుగోలు చేసినట్లు పోలీసులు తెలిపారు. అతడి వద్ద నుంచి గోపాలపూర్‌లోని ఇంటితో పాటు ప్రగతి సింగారం, యాదగిరిగుట్ట, జనగాం ఫతేశాపూర్, బచ్చన్నపేట, ఖమ్మం జిల్లా కూసుమంచి, ముచ్చర్ల, పెంబర్తి, చింతగట్టు ప్రాంతాల్లో ఉన్న 12 ప్లాట్లకు సంబంధించిన డాక్యుమెంట్లు (సుమారు రూ.4.63 కోట్లు విలువ), వ్యవసాయ భూములకు చెందిన 3 పాస్‌బుక్లు (రూ.2.80 కోట్లు), బంగారు–వెండి ఆభరణాలు (రూ.28.70 లక్షలు), నగదు రూ.25.39 లక్షలు, ఒక క్రెటా కారు (రూ.15 లక్షలు), పాస్‌పోర్ట్, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. మొత్తం స్వాధీనం చేసుకున్న ఆస్తుల విలువ సుమారు రూ.8.12 కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో వరంగల్ పర్కల్ ఏసీపీ సి. సతీష్ బాబు, శాయంపేట సీఐ రంజిత్ రావు, ఎస్‌ఐ పరమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఏసీపీ సతీష్ బాబు మాట్లాడుతూ ప్రజలు ప్రభుత్వ అనుమతి లేని చిట్ ఫండ్లను నమ్మి డబ్బులు పెట్టవద్దని సూచించారు. చిట్ ఫండ్‌లో చేరే ముందు ఆ సంస్థకు ప్రభుత్వ అనుమతి, రిజిస్ట్రేషన్ వివరాలు ఉన్నాయో లేదో పరిశీలించాలని చెప్పారు. అధిక లాభాలు, అధిక వడ్డీలు వస్తాయని చెప్పే స్కీముల పట్ల జాగ్రత్తగా ఉండాలని, అనుమానం ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. అలాగే నగదు లావాదేవీలకు బదులుగా బ్యాంకు ద్వారా లావాదేవీలు చేయాలని సూచించారు.
కేసును త్వరితగతిన ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేసిన శాయంపేట సీఐ రంజిత్ రావు, ఎస్‌ఐ పరమేశ్వర్ మరియు పోలీసు సిబ్బందిని ఏసీపీ అభినందించారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post