BLN తెలుగు దినపత్రిక.శాయంపేట/కొత్తపల్లిగోరి, మార్చి 11:
భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు (జీఎస్సార్) బుధవారం శాయంపేట మండలంలోని కొప్పుల గ్రామంలో నిర్వహించిన పెద్దమ్మ తల్లి బోనాల సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామ ప్రజల శ్రేయస్సు, ప్రాంత అభివృద్ధి కోసం ప్రార్థనలు చేశారు.
అనంతరం కొత్తపల్లిగోరి మండలం రాజక్కపల్లి గ్రామానికి వెళ్లి పోషమ్మ తల్లిని కూడా స్థానిక నాయకులతో కలిసి దర్శించుకుని పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగ ఎంతో గొప్పదని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో జరిగే అమ్మవారి జాతరలు ప్రజలను ఒకచోట చేర్చే ఆధ్యాత్మిక ఉత్సవాలని పేర్కొన్నారు. పెద్దమ్మ తల్లి, పోషమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, గ్రామాలు మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, గ్రామ పెద్దలు, మహిళలు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
అనంతరం పెద్దకొడేపాక గ్రామానికి వెళ్లిన ఎమ్మెల్యే జీఎస్సార్, తడక ఈశ్వర్ తండ్రి తడక వెంకట్రాములు అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకొని వారి నివాసానికి వెళ్లి చిత్రపటానికి పూలమాలలు అర్పించి నివాళులర్పించారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు స్థానిక కార్యకర్తలు పాల్గొన్నారు
Post a Comment