శాయంపేట, సెప్టెంబర్ 7: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన 420 హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం శాయంపేట మండల కేంద్రంలోని గ్రీవెన్స్ సెల్‌లో వినతిపత్రం సమర్పించారు.
భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, మాజీ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు బీఆర్ఎస్ నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కాలం గడుస్తున్నప్పటికీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన అనేక హామీలు పూర్తిస్థాయిలో అమలు కాలేదని ఆరోపించారు.
రైతులకు రైతు భరోసా, పంట రుణమాఫీ, రైతు కూలీలకు ఆర్థిక సహాయం, మహిళలకు మహాలక్ష్మి పథకం, ఆర్థిక భరోసా, యువతకు ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, విద్యార్థులు, వృద్ధులు, వికలాంగులు, పేద కుటుంబాలకు ఇచ్చిన హామీలను స్పష్టమైన కాలపరిమితితో అమలు చేయాలని డిమాండ్ చేశారు.
అలాగే శాయంపేట మండలంలోని గ్రామాల్లో నెలకొన్న రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, సాగునీరు, విద్యుత్, పింఛన్లు, రేషన్, రైతుల సమస్యలు తదితర అంశాలను వినతిపత్రంలో పొందుపరిచి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.
ప్రజలకు ఇచ్చిన హామీలు కేవలం ఎన్నికల హామీలుగా మిగిలిపోకుండా అవసరమైన నిధులు కేటాయించి కార్యాచరణతో అమలు చేయాలని బీఆర్ఎస్ నాయకులు కోరారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, వివిధ గ్రామాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Post a Comment