పరకాల: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేసిందని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలనకు వ్యతిరేకంగా బీఆర్‌ఎస్ చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో భాగంగా పరకాల పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు.
అంబేద్కర్ సెంటర్ నుంచి ప్రారంభమైన ర్యాలీ బస్టాండ్ వరకు సాగి తిరిగి అంబేద్కర్ సెంటర్‌కు చేరుకుంది. వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు, బీఆర్‌ఎస్ నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం అంబేద్కర్ సెంటర్‌లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు, ఆందోళనకారుల మధ్య స్వల్ప తోపులాట చోటుచేసుకుంది.
ర్యాలీలో పాల్గొనేందుకు వస్తున్న పాలిటెక్నిక్ విద్యార్థులను పోలీసులు అడ్డుకోవడంపై చల్లా ధర్మారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులను చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకంత భయమని ప్రశ్నించారు. ప్రశ్నించే గొంతులను అడ్డుకోవడం చేతగాని పాలనకు నిదర్శనమని విమర్శించారు.
హామీలు ఎక్కడ?
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని చల్లా ధర్మారెడ్డి డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు నెలకు రూ.4 వేల భృతి, తొలి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్, యూత్ కమిషన్ ఏర్పాటు, విద్యార్థులకు రూ.10 లక్షల వడ్డీలేని రుణాలు, విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటీలు, రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు వంటి హామీల పరిస్థితి ఏమైందని ప్రశ్నించారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు పెండింగ్‌లో ఉండటంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు విదేశీ విద్య కోసం ప్రకటించిన ఆర్థిక సహాయం అమలు చేయాలని కోరారు.
విద్యారంగానికి బీఆర్‌ఎస్ ప్రాధాన్యం
బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టామని ధర్మారెడ్డి తెలిపారు. గురుకులాలు, జూనియర్ కళాశాలల ఏర్పాటు, ‘మన ఊరు–మన బడి’, ‘మన బస్తీ–మన బడి’ ద్వారా పాఠశాలల్లో మౌలిక వసతుల అభివృద్ధి, ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు, మెడికల్ కాలేజీల ఏర్పాటు వంటి కార్యక్రమాలను చేపట్టామని పేర్కొన్నారు.
జీఓ 97ను రద్దు చేయాలి
పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని జీఓ 97ను వెంటనే రద్దు చేయాలని చల్లా ధర్మారెడ్డి డిమాండ్ చేశారు. యువత, విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం ఆడుకుంటే బీఆర్‌ఎస్ చూస్తూ ఊరుకోదని, విద్యార్థులకు ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ప్రజాక్షేత్రంలో పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు, యువజన నాయకులు, విద్యార్థులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Post a Comment