శాయంపేట &రేగొండ, ఆగస్టు 11: చలివాగు ప్రాజెక్టు నుంచి ఆయకట్టు ప్రాంతాలకు తక్షణమే సాగునీరు విడుదల చేసి పంటలను కాపాడాలని భూపాలపల్లి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం రేగొండ మండలం చెన్నపూర్ ఎక్స్‌రోడ్డు వద్ద జాతీయ రహదారిపై రైతులు నిర్వహించిన రాస్తారోకోలో ఆయన పాల్గొని రైతులకు సంఘీభావం తెలిపారు.
అనంతరం శాయంపేట మండలం జోగంపల్లి గ్రామంలోని చలివాగు ప్రాజెక్టు, పంపుహౌస్‌లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ.. చలివాగు ప్రాజెక్టు తూములు ఎత్తి ఆయకట్టు ప్రాంతాల్లోని పంట పొలాలకు నీటిని విడుదల చేయాలని గత 15–20 రోజులుగా ప్రభుత్వాన్ని కోరుతున్నా స్పందన లేదని విమర్శించారు. రైతులు నార్లు పోసి 45 రోజులు గడుస్తున్నా సాగునీరు అందక నాట్లు వేసుకోలేని దుస్థితి నెలకొందన్నారు.చలివాగు ప్రాజెక్టులోని మొత్తం తొమ్మిది పంపులను పూర్తి స్థాయిలో నడిపించి పంట పొలాలకు నీటిని అందించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఐదు, ఆరు పంపులు మాత్రమే పనిచేస్తున్నాయని, మిగిలిన పంపులకు మరమ్మతులు, విద్యుత్ సమస్యలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారని తెలిపారు. తొమ్మిది పంపులు పూర్తిస్థాయిలో పనిచేస్తే నెలకు సుమారు 6 టీఎంసీల నీటిని పంపింగ్ చేయవచ్చని, తద్వారా పంటలు ఎండిపోకుండా చూడటంతో పాటు తాగునీటి సమస్యను కూడా నివారించవచ్చన్నారు.
స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలోని రైతులకు సాగునీరు అందిస్తూ, తమ ప్రాంత రైతుల పంట పొలాలకు నీరు ఇవ్వకపోవడం ప్రభుత్వ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని ఆయన ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే 24 గంటల్లోగా చలివాగు నీటిని విడుదల చేయాలని, లేనిపక్షంలో ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
రైతులను ఇబ్బందులకు గురిచేసే పాలకులు కాలగర్భంలో కలిసిపోయారని వ్యాఖ్యానించిన గండ్ర వెంకటరమణారెడ్డి.. “ఇది ప్రకృతి తెచ్చిన కరువు కాదు.. రేవంత్‌రెడ్డి తెచ్చిన కరువు” అంటూ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వం ఇకనైనా స్పందించి అన్ని పంపులను నడిపించి రైతుల పంటలకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సూర్యనాయక్ తండా సర్పంచ్ లావుడియా రమారవి, సీనియర్ నాయకులు లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.
Post a Comment