శాయంపేట, ఆగస్టు 7 (బీఎల్‌ఎన్ తెలుగు): జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన రాష్ట్ర స్థాయి సన్మాన కార్యక్రమంలో హనుమకొండ జిల్లా శాయంపేట మండలానికి చెందిన ప్రముఖ చేనేత కార్మికుడు సాంబారి జనార్ధన్ రాష్ట్ర అవార్డును అందుకున్నారు.
కొత్త డిజైన్‌తో చీరను రూపొందించి నేసిన ప్రతిభకు గుర్తింపుగా రాష్ట్ర ప్రభుత్వం ఆయనను రూ.25 వేల నగదు అవార్డు, ప్రశంసాపత్రంతో సత్కరించింది. ఈ అవార్డును రాష్ట్ర చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క) చేతుల మీదుగా సాంబారి జనార్ధన్ స్వీకరించారు.
అనంతరం హనుమకొండ జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి చేతుల మీదుగా శాయంపేటకు చెందిన పూల అయిలుమల్లు సహా పలువురు చేనేత కార్మికులను పూలమాలలు వేసి, శాలువాలతో ఘనంగా సన్మానించారు.
ఇదే సందర్భంగా శాయంపేట మండల కేంద్రంలోని చేనేత సహకార సంఘానికి చెందిన ఐదుగురు పెద్దమనుషులు & సంఘం, పాలకవర్గ సభ్యులు ఆధ్వర్యంలో చేనేత కార్మికులకు ప్రత్యేక సన్మాన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర స్థాయిలో అవార్డులు అందుకున్న చేనేత కార్మికులను అభినందిస్తూ శాలువాలు కప్పి సత్కరించారు.
ఈ సందర్భంగా చేనేత కార్మికులు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం చేనేత కళాకారుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం ఆనందదాయకమని పేర్కొన్నారు. ఇలాంటి గుర్తింపులు చేనేత రంగంలో పనిచేస్తున్న కార్మికులకు మరింత ఉత్సాహాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తాయని అన్నారు. కార్యక్రమంలో చేనేత సహకార సంఘం పాలకవర్గ సభ్యులు, సంఘ పెద్దలు, చేనేత కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
Post a Comment