ప్రజాప్రతినిధులకు సమాచారం ఇవ్వకుండా పథకాల అమలు వద్దుసర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

శాయంపేట, ఆగస్టు 6: ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో పారదర్శకతకు పెద్దపీట వేయాలని, ప్రజాప్రతినిధులకు పూర్తి సమాచారం అందించిన తర్వాతే పథకాలను అమలు చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అధికారులను ఆదేశించారు. గురువారం శాయంపేట మండల కేంద్రంలో నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో ఆయన వివిధ శాఖల పనితీరును సమీక్షించారు.
సమావేశానికి డివిజన్ స్థాయి అధికారులు గైర్హాజరు కావడంపై ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేశారు. హాజరుకాని అధికారుల వివరాలను జిల్లా కలెక్టర్‌కు పంపాలని మండల ప్రత్యేక అధికారికి సూచించారు. అధికారులు ప్రజాప్రతినిధులతో సమన్వయం పాటిస్తూ ప్రభుత్వ పథకాల అమలులో పూర్తి పారదర్శకతను ప్రదర్శించాలని స్పష్టం చేశారు.
రైతుభరోసా పథకం కింద మండలంలోని 11,396 మంది రైతులకు రూ.10.67 కోట్లకు పైగా పెట్టుబడి సాయం అందించినట్లు వ్యవసాయ శాఖ అధికారులు సమావేశంలో వెల్లడించారు. సబ్సిడీ విత్తనాలు, స్ప్రేయర్లు, వ్యవసాయ పరికరాల పంపిణీకి సంబంధించిన వివరాలను ముందుగానే గ్రామ సర్పంచులకు తెలియజేయాలని, లబ్ధిదారుల ఎంపికలో ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం ఉండేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.
వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని గ్రామాల్లో ప్రత్యేక ఆరోగ్య శిబిరాలు నిర్వహించి డెంగ్యూ, మలేరియా, వైరల్ జ్వరాల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలని వైద్యశాఖ అధికారులను ఆదేశించారు. పశువులకు వ్యాధి నిరోధక టీకాలు పూర్తిస్థాయిలో వేయడంతో పాటు పశువైద్యశాలల్లో మౌలిక వసతుల కల్పనకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని పశుసంవర్ధక శాఖ అధికారులకు సూచించారు.
అదేవిధంగా మండలంలోని నాలుగు ఖాళీ రేషన్ దుకాణాలను త్వరగా భర్తీ చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సరుకుల పంపిణీ కొనసాగించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో మండల ప్రత్యేక అధికారి, పశుసంవర్ధక శాఖ అధికారి వెంకటేశ్వర్లు, తహసీల్దార్ ఆర్. ప్రవీణ్ కుమార్, ఎంపీడీవో ఫణి చంద్ర, పరకాల వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మారెపల్లి రవీందర్ (బుజ్జన్న), వివిధ శాఖల అధికారులు, సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post