అర్హులైన నిరుపేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూడాలి: ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

శాయంపేట, జూలై 29: భూపాలపల్లి నియోజకవర్గంలోని అర్హులైన ప్రతి నిరుపేదకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అందేలా ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు కృషి చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు.
శాయంపేట మండలంలోని గట్లకానిపర్తి గ్రామంలో సర్పంచ్ వైనాల విజయకుమారస్వామి ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఉపసర్పంచ్ ఒంటెల లావణ్య–కరుణాకర్ దంపతులతో పాటు సుమారు 20 మంది నాయకులు బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు వారికి కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాల ఫలాలు అందేలా పార్టీ నాయకులు క్షేత్రస్థాయిలో పనిచేయాలని సూచించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ వార్డు సభ్యులు అప్పని సంతోష్, సముద్రాల రమేష్, రాజు, సాంబయ్య, భిక్షపతి, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు బొమ్మకండి చంద్రమౌళి, వార్డు సభ్యులు ఒంటెల సమ్మయ్య, సవిత, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post