శాయంపేట, జూలై 28: మాజీ స్పీకర్ మధుసూదనాచారి పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన మచ్చలేని నాయకుడని, ఆయనపై నిరాధార విమర్శలు చేయడం మానుకోవాలని బీఆర్ఎస్ మాజీ మండల పార్టీ అధ్యక్షుడు గుర్రం రవీందర్ అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఉద్యమం నుంచి బీఆర్ఎస్ పార్టీ బలోపేతం వరకు మధుసూదనాచారి కీలక పాత్ర పోషించారని, 14 సంవత్సరాల పాటు వ్యవస్థాపక సభ్యుడిగా పనిచేసినా ఎలాంటి పదవులు ఆశించకుండా పార్టీ అభివృద్ధికే అంకితమయ్యారని కొనియాడారు.
కొంతమంది నాయకులు వ్యక్తిగత ప్రయోజనాలు, పదవులు, వ్యాపారాల కోసం పార్టీలు మారి ఇప్పుడు ప్రోటోకాల్ కూడా పాటించకుండా విమర్శలు చేయడం సరికాదన్నారు. భూపాలపల్లి జిల్లా ఏర్పాటులో మధుసూదనాచారి చేసిన కృషిని ప్రజలు ఇప్పటికీ గుర్తుంచుకున్నారని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోయినప్పుడు పార్టీ మారిన వారి చరిత్రను ప్రజలు గమనిస్తున్నారని, రేపు మరోసారి పార్టీ మారబోమని వారు హామీ ఇవ్వగలరా అని ప్రశ్నించారు. ఉద్యమకారులను విస్మరించి తమ అనుచరులకు మాత్రమే పదవులు పంచిన నాయకులు ఇప్పుడు పార్టీ కోసం నిత్యం కష్టపడుతున్న కార్యకర్తలపై విమర్శలు చేయడం తగదన్నారు.
బీఆర్ఎస్ పార్టీని బలహీనపరిచే ప్రయత్నాలు మానుకోవాలని, పార్టీ కోసం పనిచేసే నాయకులు, కార్యకర్తలపై నిరాధార ఆరోపణలు చేస్తే సహించేది లేదని, ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నిమ్మల మహేందర్, పల్లేబోయిన సారయ్య, జాలిగపు అశోక్, అడుప ప్రభాకర్, పొతుగంటి మల్లయ్య, కుమారస్వామి, నమితబాజీ అశోక్, కోడెపాక బాబు, జూపాక సారయ్య, ఉపసర్పంచ్ కొత్తగట్టు సాయి, అరికిల్ల విజయ్, తరుణ్, గోపి, బూర విజయ్, కుక్కల గణేష్, బాబు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
Post a Comment