పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి: డీఎంహెచ్‌వో డాక్టర్ మధుసూదన్

భూపాలపల్లి, జూన్ 24: ఈ నెల 28న నిర్వహించనున్న పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ కార్యక్రమాన్ని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్‌వో) డాక్టర్ మధుసూదన్ పిలుపునిచ్చారు.
పుట్టిన శిశువు నుంచి ఐదు సంవత్సరాల లోపు ఉన్న ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని ఆయన తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. జిల్లాలో 0 నుంచి 5 సంవత్సరాల వయస్సు గల మొత్తం 34,728 మంది చిన్నారులకు పోలియో చుక్కలు అందించేందుకు విస్తృత ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
జిల్లా వ్యాప్తంగా 296 పోలియో బూత్‌లు, 14 మొబైల్ బృందాలు, 14 ట్రాన్సిట్ బృందాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మొత్తం 1,184 మంది ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు, వైద్యులు, ఇతర సిబ్బంది విధులు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
అలాగే జిల్లాలో 25 హై-రిస్క్ ప్రాంతాలను గుర్తించి, అక్కడ 137 మంది చిన్నారులను గుర్తించినట్లు తెలిపారు. ఈ ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి సారించి ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు అందించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
పోలియో నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ఒక్క చిన్నారి కూడా మిగిలిపోకుండా వంద శాతం పోలియో చుక్కలు వేయించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డీఎంహెచ్‌వో డాక్టర్ మధుసూదన్ ప్రజలకు పిలుపునిచ్చారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post