లింగ నిర్ధారణ పరీక్షలు చట్టరీత్యా నేరం – డీఎంహెచ్‌వో డాక్టర్ మధుసూదన్

భూపాలపల్లి, జూన్ 24: లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం, చేయించుకోవడం, వాటిని ప్రోత్సహించడం చట్టరీత్యా నేరమని, అలాంటి చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జయశంకర్ భూపాలపల్లి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్‌వో) డాక్టర్ మధుసూదన్ హెచ్చరించారు.
జిల్లా కేంద్రంలోని వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన జిల్లా అడ్వైజరీ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జిల్లాలో ప్రస్తుతం మొత్తం 14 స్కానింగ్ కేంద్రాలు పనిచేస్తున్నాయని, వాటిలో ఐదు ప్రభుత్వ, తొమ్మిది ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లు ఉన్నాయని తెలిపారు.
లింగ నిర్ధారణ పరీక్షల నిరోధంపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఈ పరీక్షలు నిర్వహించడం చట్టవిరుద్ధమని ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించినా, చేయించుకున్నా లేదా వాటిని ప్రోత్సహించినా సంబంధిత వ్యక్తులకు మూడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.50 వేల జరిమానా విధించే అవకాశం ఉందని స్పష్టం చేశారు.
ఎవరైనా లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు సమాచారం ఉంటే 94405 86982 లేదా 63032 39891 నంబర్లకు వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేయాలని ప్రజలను కోరారు.
ఈ సమావేశంలో ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ శ్రీదేవి, గైనకాలజిస్టులు డాక్టర్ అనీషా బేగం, డాక్టర్ సురేందర్ (పీడియాట్రిషన్), సోషల్ వర్కర్లు, డెమో శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post