ప్రత్యేక ఓటరు జాబితా సవరణలో ప్రతి అర్హ ఓటరు భాగస్వామి కావాలి2కే రన్‌లో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

భూపాలపల్లి, జూన్ 24: ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్–2026) కార్యక్రమంలో అర్హులైన ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పిలుపునిచ్చారు.ప్రజల్లో ఓటరు జాబితా సవరణపై అవగాహన కల్పించే ఉద్దేశంతో బుధవారం ఇల్లందు క్లబ్ హౌస్ నుంచి కలెక్టరేట్ వరకు నిర్వహించిన 2కే రన్‌ను జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ జెండా ఊపి ప్రారంభించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణకు ఖచ్చితమైన, పారదర్శకమైన ఓటరు జాబితా అత్యంత అవసరమని అన్నారు. భారత ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని ప్రతి అర్హ ఓటరు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఇప్పటికే ఓటరుగా నమోదైన వారు తమ పేర్లను పరిశీలించి, అవసరమైతే సవరణలు, మార్పులు, చేర్పులు చేసుకోవాలని తెలిపారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం జూన్ 25 నుంచి జూలై 24 వరకు బూత్ లెవల్ అధికారులు ఇంటింటికీ వచ్చి ఎన్యూమరేషన్ ఫారాలు సేకరిస్తారని, ప్రజలు పూర్తి వివరాలతో వాటిని నింపి అందించాలని కోరారు.
మరణించిన వారి పేర్లు, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారి వివరాలు, ఒకటి కంటే ఎక్కువ చోట్ల నమోదైన డూప్లికేట్ ఓట్లను గుర్తించి తొలగించడం ద్వారా తప్పులులేని ఓటరు జాబితా రూపొందించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. అర్హులైన ఏ ఒక్కరి ఓటు హక్కు కోల్పోకుండా, అనర్హుల పేర్లు జాబితాలో లేకుండా చూడడమే ఎన్నికల సంఘం లక్ష్యమని స్పష్టం చేశారు.ఓటర్ల నమోదు, సవరణలు, అభ్యంతరాలు, క్లెయిమ్‌లకు సంబంధించిన వివరాల కోసం బూత్ లెవల్ అధికారులను సంప్రదించాలని ప్రజలకు సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, ఏఎస్పీ నరేష్ కుమార్, డీఆర్వో వసంత కుమారి, ఆర్డీఓ హరికృష్ణ, శిక్షణ డిప్యూటీ కలెక్టర్ నవీన్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ఉదయ్ కుమార్, జిల్లా క్రీడల అధికారి చిర్రా రఘు, ఎన్నికల విభాగం డీటీ అబ్బాస్, కౌన్సిలర్ అప్పం కిషన్, వివిధ శాఖల జిల్లా అధికారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post