భూపాలపల్లి, జూన్ 25: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం (ఐడీఓసీ)లో బుధవారం నవజాత శిశువుల సంరక్షణ, మాతా–శిశు మరణాల నివారణపై అత్యవసర సమీక్ష సమావేశం నిర్వహించారు.
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్‌వో) డాక్టర్ మధుసూదన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్)కు చెందిన వివిధ విభాగాల వైద్యులు పాల్గొన్నారు. సమావేశంలో నవజాత శిశువుల సంరక్షణకు తీసుకోవాల్సిన కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు.
ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో మాట్లాడుతూ, పుట్టినప్పటి నుంచి మొదటి సంవత్సరం వరకు ప్రతి చిన్నారికి అన్ని రకాల వ్యాధి నిరోధక టీకాలను తప్పనిసరిగా వేయించాలని, ఈ టీకాలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పూర్తిగా ఉచితంగా అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
హై రిస్క్ గర్భిణులను ముందుగానే గుర్తించి నిరంతర పర్యవేక్షణ చేయాలని, గర్భిణులు తప్పనిసరిగా నాలుగు ప్రసూతి పూర్వ వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఐరన్–ఫోలిక్ యాసిడ్ మాత్రలను క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా మాతృ మరణాలు, శిశు మరణాలను గణనీయంగా తగ్గించవచ్చని వివరించారు.
పుట్టిన వెంటనే శిశువుకు ముర్రుపాలు పట్టించడం, తల్లిపాలను నిరంతరంగా అందించడం అత్యంత అవసరమని పేర్కొన్నారు. అలాగే అవసరమైన సందర్భాల్లో సకాలంలో సిజేరియన్ శస్త్రచికిత్సలు నిర్వహించడం ద్వారా నవజాత శిశు మరణాలను నివారించవచ్చని తెలిపారు.
ఈ సమావేశంలో జీజీహెచ్ భూపాలపల్లి ఆర్‌ఎంవో డాక్టర్ నాగ శశికాంత్, అసోసియేట్ ప్రొఫెసర్లు డాక్టర్ సంధ్య, డాక్టర్ సురేందర్ (పీడియాట్రిక్స్), ఎంసీహెచ్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ శ్రీదేవి, డాక్టర్ శ్రీధర్, డాక్టర్ నాగరాణి, డాక్టర్ సందీప్, డెమో శ్రీదేవి, డీడీఎం మధు తదితరులు పాల్గొన్నారు.
Post a Comment