వరంగల్, జూన్ 25:
వరంగల్ నగరంలోని కాశీబుగ్గ ప్రాంతంలో అత్యంత అపరిశుభ్ర పరిస్థితుల్లో అక్రమంగా పచ్చడి తయారీ, నిల్వలు నిర్వహిస్తున్న కేంద్రంపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు మెరుపు దాడులు నిర్వహించి భారీ మొత్తంలో కల్తీ ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.ఇంతేజార్‌గంజ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కాశీబుగ్గ సాయి వీధిలో ఉన్న ఓ నివాస గృహంలో అక్రమంగా పచ్చళ్లు తయారు చేసి నిల్వ ఉంచుతున్నారనే విశ్వసనీయ సమాచారంతో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున కుళ్లిపోయిన పచ్చడి ముడిసరుకులు, ఆహార పదార్థాలు నిల్వ ఉంచినట్లు గుర్తించారు. వాటిని చిన్న ప్యాకెట్లలో ప్యాక్ చేసి స్థానిక కిరాణా దుకాణాలు, ఇతర వ్యాపార కేంద్రాలకు సరఫరా చేస్తున్నట్లు విచారణలో వెల్లడైంది.ఈ వ్యవహారానికి సంబంధించి కాశీబుగ్గకు చెందిన అరికెల శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. దాడుల్లో 750 కిలోల టమోటాలు, 900 కిలోల మామిడికాయలు, 200 కిలోల నిమ్మకాయలు, 100 కిలోల ఉసిరికాయలు, 150 కిలోల అల్లం-వెల్లుల్లి పేస్ట్‌తో పాటు మొత్తం రూ.2.25 లక్షల విలువైన కుళ్లిపోయిన, కల్తీ ఆహార నిల్వలను స్వాధీనం చేసుకున్నారు.
పట్టుబడిన నిందితుడిని, స్వాధీనం చేసుకున్న సరుకును తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం ఇంతేజార్‌గంజ్ పోలీస్‌స్టేషన్‌కు అప్పగించినట్లు టాస్క్‌ఫోర్స్ అధికారులు వెల్లడించారు.
ప్రజలు బ్రాండ్ లేని లేదా అనుమానాస్పద ఆహార పదార్థాలు, పచ్చళ్లను కొనుగోలు చేసే సమయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. కల్తీ ఆహార పదార్థాల తయారీ, నిల్వలు లేదా విక్రయాలకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు.టాస్క్‌ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ పర్యవేక్షణలో ఇన్‌స్పెక్టర్ బండారి రాజు, ఆర్‌ఎస్‌ఐ భాను ప్రకాష్‌తో పాటు టాస్క్‌ఫోర్స్ సిబ్బంది ఈ దాడుల్లో పాల్గొన్నారు.
Post a Comment