శాయంపేట పీఏసీఎస్ వద్ద మొక్కజొన్న రైతుల ఆందోళన.. డబ్బుల్లో భారీ కోతలపై ఆగ్రహం

శాయంపేట: హనుమకొండ జిల్లా శాయంపేట మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) కార్యాలయం ఎదుట మొక్కజొన్న రైతులు శుక్రవారం ఆందోళన చేపట్టారు. తాము విక్రయించిన మొక్కజొన్నకు సంబంధించిన చెల్లింపుల్లో ఒక్కో రైతుకు రూ.2 వేల నుంచి రూ.4 వేల వరకు తక్కువ మొత్తాలు జమయ్యాయని ఆరోపిస్తూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
శాయంపేట మండలంలోని పీఏసీఎస్ గోదాం ద్వారా స్థానిక రైస్ మిల్లుకు తరలించిన మొక్కజొన్న బస్తాలకు సంబంధించిన చెల్లింపులు రైతుల ఖాతాల్లో పూర్తిగా జమ కాలేదని వారు తెలిపారు. సుమారు వంద మందికి పైగా రైతుల ఖాతాల్లో డబ్బులు తక్కువగా జమయ్యాయని, ఈ విధంగా లక్షల రూపాయల రైతుల సొమ్ము అక్రమాలకు గురైందని ఆరోపించారు.
ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు దృష్టికి తీసుకెళ్లగా సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారని, అయినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని రైతులు వాపోయారు. సంబంధిత అధికారులు కూడా తమ సమస్యను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
తమకు రావాల్సిన పూర్తి చెల్లింపులను వెంటనే అందజేసి, అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. లేని పక్షంలో జాతీయ రహదారిపై ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
ఈ ఆందోళనలో గాజే రాజేందర్, కానుగుల నాగరాజు, అబ్బు రాజు, కోలా ఆనందం, కోల మచ్చయ్య, బేర్గు సతీష్, ముదిరెడ్డి విజ్జన్న, సాధు కుమారస్వామి తదితర రైతులు పాల్గొన్నారు

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post