వరంగల్ జిల్లా కరీంబాద్‌కు చెందిన ఆడెపు అఖిల భర్త రాజేష్ 2024 డిసెంబరులో మృతిచెందడంతో కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో పడింది. ఏడు సంవత్సరాల కుమారుడు, ఐదు సంవత్సరాల కుమార్తెతో దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన అఖిల జీవనోపాధి కోసం కుట్టుమిషన్ పని నేర్చుకుని కుటుంబాన్ని పోషించే ప్రయత్నం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో అఖిల పద్మశాలి యువసేనను సంప్రదించగా, యువసేన సభ్యులు ముందుకు వచ్చి రూ.64 వేల మేర విరాళాలను సమీకరించారు. అయితే నగదు సహాయం కొద్ది నెలలకే పరిమితమవుతుందని భావించిన యువసేన, దీర్ఘకాలిక ఉపాధి కల్పించే లక్ష్యంతో మూడు కుట్టు మిషన్లు, క్లాత్ మెటీరియల్‌ను అందించింది. దీంతో అఖిల స్వయం ఉపాధి పొందడంతో పాటు మరికొందరికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని యువసేన ఆకాంక్షించింది.
ఈ కార్యక్రమంలో పద్మశాలి యువసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మునగాల రవికిరణ్, రాష్ట్ర నాయకుడు చదుల్లా రంగనాథ్‌తో పాటు వరంగల్‌కు చెందిన యువసేన సభ్యులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మునగాల రవికిరణ్ మాట్లాడుతూ, 2022లో స్థాపించబడిన పద్మశాలి యువసేన ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రూ.25 లక్షలకు పైగా ఆర్థిక సహాయ కార్యక్రమాలు నిర్వహించిందని తెలిపారు. భవిష్యత్తులో కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి ఆపదలో ఉన్న కుటుంబాలకు అండగా నిలుస్తామని చెప్పారు.
ఈ కార్యక్రమానికి ఆర్థిక సహకారం అందించిన పద్మశాలి యువసేన సభ్యులందరికీ నిర్వాహకులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
Post a Comment