భూపాలపల్లి ఆర్టీఓ అధికారి వెంకన్న మృతి ఘటనపై జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ సమగ్ర విచారణ

భూపాలపల్లి, జూన్ 24: ఈ నెల 22న భూపాలపల్లి ఆర్టీఓ కార్యాలయం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో జిల్లా రవాణా శాఖ అధికారి వెంకన్న మృతి చెందిన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ మేరకు జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ చంద్రశేఖర్ గౌడ్‌ను విచారణ అధికారిగా నియమించింది.
విచారణలో భాగంగా బుధవారం భూపాలపల్లికి చేరుకున్న చంద్రశేఖర్ గౌడ్ సంఘటనకు సంబంధించిన అన్ని అంశాలపై సమగ్రంగా దర్యాప్తు చేపట్టారు. ముందుగా ఘనపూర్ పోలీస్ స్టేషన్‌లో పోలీసు అధికారులతో సమావేశమై, ప్రమాదానికి సంబంధించి పోలీసులు చేపట్టిన ప్రాథమిక దర్యాప్తు వివరాలను సీఐ కరుణాకర్ రావు, ఎస్‌ఐ అశోక్‌లను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ప్రమాదానికి సంబంధించిన లారీ డ్రైవర్, లారీ యజమాని, హార్వెస్టర్ డ్రైవర్‌లను విడివిడిగా విచారించారు. అనంతరం జెన్‌కో అధికారులతో సమావేశమై ప్రమాదం జరిగిన రోజు లారీలో తరలించిన బొగ్గు వివరాలను సేకరించారు.
తర్వాత సంఘటనా స్థలాన్ని పరిశీలించిన విచారణ అధికారి, నలుగురు ప్రత్యక్ష సాక్షులను ప్రశ్నించి వారి వాంగ్మూలాలను నమోదు చేశారు. అలాగే సీన్ రీ-కన్‌స్ట్రక్షన్ నిర్వహించి ప్రమాదం జరిగిన పరిస్థితులను విశ్లేషించారు. సమీపంలోని సీసీటీవీ ఫుటేజీలను కూడా పరిశీలించారు.
అనంతరం బొగ్గు లోడింగ్ పాయింట్ అయిన తాడిచర్ల ఓపెన్‌కాస్ట్‌కు వెళ్లి అక్కడి ప్రతినిధులతో సమావేశమై, ప్రమాదం జరిగిన రోజు లారీ లోడింగ్‌కు సంబంధించిన రికార్డులను పరిశీలించారు.
ఈ విచారణలో మోటారు వాహన తనిఖీ అధికారులు జంగ్లీ శ్రీనివాస్, శివపల్లి శ్రీనివాస్, బారగాడి శ్రీనివాస్, భూపాలపల్లి ఏఎంవీఐలు ఫాహిమా సుల్తానా, సుందర్ లాల్, శ్రీనివాస్, ఘనపూర్ సీఐ కరుణాకర్ రావు, ఎస్‌ఐ అశోక్ తదితరులు పాల్గొన్నారు.
ఈ ఘటనకు సంబంధించిన ప్రాథమిక విచారణ నివేదికను ఒకటి లేదా రెండు రోజుల్లో రాష్ట్ర రవాణా కమిషనర్‌కు సమర్పించనున్నట్లు అధికారులు తెలిపారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post