పరకాల యువతకు నైపుణ్యాభివృద్ధి కేంద్రంగా ఏటీసీ పరకాలను ఎడ్యుకేషన్ హబ్‌గా తీర్చిదిద్దుతాం: ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి

పరకాల, జూన్ 5:
పరకాల ప్రాంత యువతకు నైపుణ్యాభివృద్ధి అవకాశాలను పెంపొందించేందుకు అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ (ఏటీసీ) కీలకంగా మారుతుందని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. పరకాల పట్టణ కేంద్రంలో నూతనంగా నిర్మించనున్న అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటుకు సంబంధించి అధికారులతో కలిసి భూమిని పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన శిక్షణను అందించడం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని తెలిపారు. యువతకు నైపుణ్యాభివృద్ధి కల్పించి ఉద్యోగ అవకాశాలను పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యువత ఉపాధి, విద్యాభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. వ్యవసాయం, విద్య, ఉపాధి రంగాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని చెప్పారు.
పరకాల పట్టణాన్ని ఎడ్యుకేషన్ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా చర్యలు చేపడుతున్నామని, అందులో భాగంగానే రాజుపేట సమీపంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్, నూతన ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ ఆసుపత్రి, అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ వంటి కీలక ప్రాజెక్టులను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.
ఏటీసీ నిర్మాణం పూర్తయితే పరకాల యువతకు నైపుణ్యాభివృద్ధి కేంద్రంగా మారడంతో పాటు పట్టణ అభివృద్ధికి కూడా దోహదపడుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అనంతరం పట్టణంలోని సైడ్ డ్రైనేజీ నిర్మాణ పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
పరకాల పట్టణానికి పూర్వ వైభవం తీసుకురావడానికి ప్రజలందరూ సహకరించాలని ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి పిలుపునిచ్చారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post