వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం కోపాకులపాడు గ్రామంలో ఓ వ్యవసాయ పొలంలో బంగారు ఆభరణాలు లభించిన ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. దొరికిన ఆభరణాల పంపకాల విషయంలో కౌలు రైతు, కూలీల మధ్య తలెత్తిన వివాదం చివరకు పోలీస్ స్టేషన్‌కు చేరింది.
గ్రామానికి చెందిన ప్రతాప్ రెడ్డికి చెందిన ఆరు ఎకరాల వ్యవసాయ భూమిని బాలు అనే కౌలు రైతు సాగు చేస్తున్నాడు. పంట సాగు కోసం దుక్కి దున్నుతున్న సమయంలో నాగలికి తగిలి కొన్ని బంగారు ఆభరణాలు లభించినట్లు సమాచారం. అనంతరం వాటిని రహస్యంగా ఇంటికి తీసుకెళ్లినట్లు గ్రామస్తులు చెబుతున్నారు.అయితే, దొరికిన ఆభరణాల పంపకాల విషయంలో కౌలు రైతు, కూలీల మధ్య వివాదం చెలరేగడంతో విషయం బయటకు వచ్చింది. భూమి యజమాని ప్రతాప్ రెడ్డి ఇరువర్గాలను మందలించినప్పటికీ, ఈ భూమిని గతంలో విక్రయించిన జైపాల్ రెడ్డి కూడా తనకు వాటా రావాలని కోరుతూ పోలీసులను ఆశ్రయించినట్లు తెలిసింది. దీంతో ఈ వ్యవహారం పోలీసుల దృష్టికి చేరింది.ఈ ప్రాంతంలో గతంలో కాకతీయుల కాలానికి చెందిన ఆలయాలు ఉన్నట్లు స్థానికంగా ప్రచారం ఉండటంతో, ఆ భూమిలో మరిన్ని పురాతన నిధులు ఉండవచ్చనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. అయితే ఈ ప్రచారానికి అధికారికంగా ఎలాంటి నిర్ధారణ లేదు.
దొరికిన బంగారు ఆభరణాల అసలు విలువ ఎంత, అవి ఎవరికి చెందుతాయి, తదుపరి చర్యలు ఎలా ఉండనున్నాయనే అంశాలపై స్థానికంగా ఆసక్తికర చర్చ కొనసాగుతోంది. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టినట్లు సమాచారం.
Post a Comment