హనుమకొండ, జూన్ 5:
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందని మోటివేషనల్ స్పీకర్ పోగు అశోక్ అన్నారు. ఈ సందర్భంగా విడుదల చేసిన సందేశంలో ఆయన మాట్లాడుతూ ప్రకృతి మనకు కేవలం నివాసాన్ని మాత్రమే కాకుండా శ్వాసను, ఆహారాన్ని, జీవనాధారాన్ని కూడా అందిస్తోందని పేర్కొన్నారు.ప్రతి సంవత్సరం జూన్ 5న జరుపుకునే ప్రపంచ పర్యావరణ దినోత్సవం భూమిపై మానవాళి మనుగడకు సంబంధించిన బాధ్యతలను గుర్తు చేస్తుందని అన్నారు. ఈ ఏడాది పర్యావరణ దినోత్సవం సందర్భంగా "ప్రకృతి నుంచి స్ఫూర్తి పొందుదాం.. వాతావరణం కోసం.. మన భవిష్యత్తు కోసం" అనే సందేశాన్ని ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని సూచించారు.ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, అకాల వర్షాలు, కరువులు, ప్రకృతి వైపరీత్యాలు పర్యావరణ నిర్లక్ష్యానికి నిదర్శనాలని తెలిపారు. ప్రకృతి మనకు ఇస్తున్న హెచ్చరికలను గుర్తించి, పర్యావరణ పరిరక్షణకు అందరూ కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.
ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, నీటిని పొదుపుగా వినియోగించడం, వర్షపు నీటిని సంరక్షించడం, చెట్లను నాటి వాటిని పరిరక్షించడం, వ్యర్థాలను వేర్వేరుగా నిర్వహించడం వంటి చర్యల ద్వారా పర్యావరణ రక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావచ్చని వివరించారు.భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన గాలి, పరిశుభ్రమైన నీరు, ఆరోగ్యకరమైన జీవన వాతావరణాన్ని అందించడం మనందరి బాధ్యత అని పేర్కొన్నారు. భూమి మన పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తి కాదని, మన పిల్లల నుంచి అప్పుగా తీసుకున్న సంపద అని గుర్తుంచుకోవాలని అన్నారు.ప్రకృతితో పోరాడకుండా, ప్రకృతికి రక్షకులుగా మారాలని పిలుపునిస్తూ, పర్యావరణాన్ని కాపాడడం ప్రతి పౌరుడి కనీస బాధ్యతతో పాటు పవిత్రమైన విధి అని పోగు అశోక్ పేర్కొన్నారు
Post a Comment