పంట అవశేషాల కాల్చివేతపై నిషేధంఉల్లంఘిస్తే కఠిన చర్యలు: జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్

BLN తెలుగు దినపత్రిక.హనుమకొండ, జూన్ 5:
పంట అవశేషాలను కాల్చడం వల్ల వాయు కాలుష్యం పెరగడంతో పాటు పర్యావరణ సమతుల్యత దెబ్బతిని, నేల సారవంతత తగ్గిపోవడం, ప్రజారోగ్యం ప్రమాదంలో పడటం వంటి తీవ్ర పరిణామాలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో హనుమకొండ జిల్లా వ్యాప్తంగా పంట వ్యర్థాల కాల్చివేతను తక్షణమే నిషేధిస్తూ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ ఉత్తర్వులు జారీ చేశారు.వ్యవసాయ పంటల కోత అనంతరం పొలాల్లో మిగిలిపోయే అవశేషాలను తగులబెట్టడం వల్ల హానికర వాయువులు విడుదలై వాతావరణ కాలుష్యం పెరుగుతుందని, దీని ప్రభావం ప్రజల ఆరోగ్యం, రహదారి భద్రత, పర్యావరణంపై తీవ్రంగా పడుతుందని కలెక్టర్ తెలిపారు. అంతేకాకుండా భూమిలోని సేంద్రియ పదార్థాలు, ఉపయోగకరమైన సూక్ష్మజీవులు నశించి భూసారం క్షీణించే ప్రమాదం ఉందన్నారు.ప్రజా భద్రత, పర్యావరణ పరిరక్షణ, ప్రజా శాంతిభద్రతల దృష్ట్యా భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్‌ఎస్‌ఎస్)-2023 సెక్షన్ 163 కింద కల్పించిన అధికారాలను వినియోగిస్తూ జిల్లాలోని అన్ని గ్రామాలు, వ్యవసాయ భూములు, పొలాల్లో పంట అవశేషాల కాల్చివేతను తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు నిషేధిస్తున్నట్లు స్పష్టం చేశారు.ఈ ఉత్తర్వులను ఉల్లంఘించిన వారిపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్)-2023 సెక్షన్ 223 ప్రకారం కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉల్లంఘనల కారణంగా ప్రజలకు ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు లేదా మానవ ప్రాణాలకు ప్రమాదం కలిగితే జైలు శిక్షతో పాటు జరిమానా విధించే అవకాశం ఉందని పేర్కొన్నారు.జిల్లాలోని తహశీల్దార్లు, ఎంపీడీఓలు, వ్యవసాయ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, పోలీస్ అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది గ్రామాల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, పంట కోతల సమయంలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అలాగే వ్యవసాయ, రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్, కాలుష్య నియంత్రణ శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేసి ఉత్తర్వులను కట్టుదిట్టంగా అమలు చేయాలని సూచించారు.
పంట అవశేషాలను కాల్చడం అంటే భూమాతను, పర్యావరణాన్ని, మన భవిష్యత్తును కాల్చినట్టే. రైతులు ప్రత్యామ్నాయ పద్ధతులను అనుసరించి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలి. ప్రతి గ్రామం కాలుష్య రహితంగా, ప్రతి పొలం సారవంతంగా ఉండేలా అందరూ సహకరించాలి” అని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ పిలుపునిచ్చారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post