మైలారం, జూన్ 10: మైలారం గ్రామపంచాయతీ సర్పంచ్, ఉపసర్పంచ్ మరియు పాలకవర్గం ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రామసభలో గ్రామ యువకులు పలు ప్రజా సమస్యలపై వినతిపత్రాన్ని సమర్పించారు.
గ్రామంలో బెల్ట్ షాపులను తక్షణమే మూసివేయాలని వారు కోరారు. మద్యపానానికి గ్రామంలోని అనేక పేద కుటుంబాల సభ్యులు బానిసలుగా మారుతున్నారని, దీంతో కుటుంబాల ఆర్థిక పరిస్థితి దెబ్బతింటోందని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామ యువత అంతా ఏకగ్రీవంగా బెల్ట్ షాపుల నిర్మూలనకు తీర్మానం చేసినట్లు తెలిపారు.
అలాగే గ్రామంలోని అంతర్గత రోడ్లపై పెంటకుప్పలు, ఇసుక మొరాలు వేసి ఉంచడం, పశువులను కట్టేయడం, చెత్తను వేయడం వల్ల రహదారులు ఇరుకుగా మారుతున్నాయని పేర్కొన్నారు. దీంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు.
ఈ సమస్యలపై గ్రామపంచాయతీ పాలకవర్గం, సిబ్బంది స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. రోడ్లపై ఆక్రమణలు, చెత్త తొలగించని వారిపై జరిమానాలు విధించి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు చేపట్టాలని వినతిపత్రంలో పేర్కొన్నారు.
గ్రామసభలో ప్రజా సమస్యల పరిష్కారానికి గ్రామపంచాయతీ అధికారులు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.
Post a Comment