హైదరాబాద్, జూన్ 7: నీట్-2026 పరీక్షను ఎలాంటి లోపాలకు తావులేకుండా పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. శనివారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం నుంచి అదనపు డీజీపీ మహేష్ భగవత్, పౌరసరఫరాల కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తదితర ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో నీట్-2026 పరీక్ష నిర్వహణ ఏర్పాట్లు, ధాన్యం కొనుగోలు, జూన్ 9న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ముఖ్యమంత్రి పాల్గొనే సభ ఏర్పాట్లపై సమీక్షించారు.
ఈ సందర్భంగా సీఎస్ రామకృష్ణారావు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా జూన్ 21న జరగనున్న నీట్-2026 పరీక్ష కోసం 24 పట్టణాల్లో 208 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మొత్తం 72,956 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నందున అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రశ్నాపత్రాల రవాణా, అభ్యర్థుల నమోదు, బయోమెట్రిక్ ధృవీకరణ, తనిఖీలు, భద్రతా ఏర్పాట్లను సమర్థవంతంగా నిర్వహించాలని చెప్పారు. సామాజిక మాధ్యమాల్లో వ్యాపించే వదంతులపై వెంటనే స్పందించి వాటిని అరికట్టాలని సూచించారు.
ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా చోంగ్తు మాట్లాడుతూ పరీక్షల నిర్వహణకు అవసరమైన మౌలిక సదుపాయాలు, రవాణా, భద్రత, విద్యుత్, తాగునీరు తదితర సౌకర్యాలను కల్పిస్తున్నట్లు తెలిపారు.
అదనపు డీజీపీ మహేష్ భగవత్ మాట్లాడుతూ పోలీసు శాఖ, జిల్లా యంత్రాంగం మధ్య సమన్వయం కీలకమని పేర్కొన్నారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టి సామాజిక మాధ్యమాలను నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు.
జాతీయ పరీక్షా సంస్థ (ఎన్‌టీఏ) డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్ మాట్లాడుతూ ఈసారి పరీక్షల భద్రత కోసం మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపట్టామని తెలిపారు. ప్రశ్నాపత్రాల రవాణా కోసం తొలిసారిగా భారత వైమానిక దళం సేవలను వినియోగిస్తున్నట్లు వెల్లడించారు.
అనంతరం ధాన్యం కొనుగోలు ప్రక్రియను సమీక్షించిన సీఎస్, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కోత పూర్తయిన ధాన్యం తడవకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు.
పౌరసరఫరాల కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 71 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి, 10.58 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.13,577 కోట్ల కనీస మద్దతు ధర జమ చేసినట్లు తెలిపారు.
ఇదిలా ఉండగా, జూన్ 9న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో మహిళా సంఘాలకు బస్సుల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు సీఎస్ తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి మండల మహిళా సమాఖ్యకు ఒక్కొక్కటి చొప్పున మొత్తం 553 బస్సులను ముఖ్యమంత్రి చేతుల మీదుగా అందజేయనున్నట్లు పేర్కొన్నారు. సభ విజయవంతానికి గ్రామీణాభివృద్ధి, ఆర్టీసీ శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో గుర్రంపేట నుంచి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని మహిళా సంఘాల సభ్యులు సభకు సకాలంలో చేరుకునేలా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి బస్సులో తాగునీరు, అరటిపండ్లు, ప్రథమ చికిత్స కిట్లు అందుబాటులో ఉంచాలని, ఏపీఎం, సీసీ, ఆశా, ఏఎన్‌ఎం, పోలీసు సిబ్బంది తప్పనిసరిగా ఉండేలా చూడాలని సూచించారు. మహిళలు సురక్షితంగా ప్రయాణించి తిరిగి స్వగృహాలకు చేరుకునేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
Post a Comment