దామెర పోలీస్ స్టేషన్‌లో తాత్కాలిక డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్న మదారపు రాజ్‌కుమార్ (32) ఆదివారం గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. ఈ విషాద వార్త తెలుసుకున్న దామెర పోలీస్ స్టేషన్ ఎస్సైలు అశోక్, రమేష్, ఏఎస్సై యాకయ్యతో పాటు పోలీసు సిబ్బంది మృతుడి నివాసానికి చేరుకుని ఆయన భౌతికకాయానికి ఘనంగా నివాళులర్పించారు.
సోమవారం నిర్వహించిన అంత్యక్రియల్లో పోలీసు అధికారులు, సిబ్బంది స్వయంగా పాల్గొని రాజ్‌కుమార్ మృతదేహాన్ని మోసి తమ మానవత్వాన్ని చాటుకున్నారు. సుమారు ఐదు గంటలపాటు కొనసాగిన అంత్యక్రియల కార్యక్రమాల్లో ఎస్సైలు అశోక్, రమేష్, ఏఎస్సై యాకయ్యతో పాటు పోలీసు సిబ్బంది కుటుంబ సభ్యులకు అండగా నిలిచారు.
రాజ్‌కుమార్ మండల ప్రజలకు సుపరిచితుడు కావడంతో ఆయన మృతితో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. అంత్యక్రియలకు ప్రజాప్రతినిధులు, స్నేహితులు, బంధువులు, గ్రామస్తులు భారీ సంఖ్యలో హాజరై కన్నీటి నివాళులర్పించారు.
పోలీసు అధికారులు సహోద్యోగి పట్ల చూపిన ఆప్యాయత, మానవీయ స్పందనను స్థానికులు అభినందించారు. రాజ్‌కుమార్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
Post a Comment