తెలంగాణ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: ఎస్సై పరమేశ్వర్

శాయంపేట, జూన్ 2: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని శాయంపేట పోలీస్ స్టేషన్‌లో సోమవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా శాయంపేట ఎస్సై పరమేశ్వర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి తెలంగాణ అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు.
అనంతరం పోలీసు సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడిన ఎస్సై పరమేశ్వర్, తెలంగాణ రాష్ట్రం ఒక్క రోజులో ఏర్పడలేదని, 1956 నుంచి ప్రారంభమైన ప్రత్యేక తెలంగాణ ఆకాంక్ష 1969 జై తెలంగాణ ఉద్యమం, అనంతరం పలు దశల్లో సాగిన ప్రజా పోరాటాలు, విద్యార్థుల ఉద్యమాలు, ఉద్యోగుల సమ్మెలు, వేలాది మంది ప్రజల త్యాగాల ఫలితంగానే 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని పేర్కొన్నారు.
తెలంగాణ సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల త్యాగాలు ఎప్పటికీ మరువలేనివని, వారి ఆశయాలను సాకారం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. రాష్ట్ర సాధనలో విద్యార్థులు, యువత, ఉద్యోగులు, రైతులు, మహిళలు అందించిన సహకారం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని తెలిపారు.
అమరవీరుల త్యాగస్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని ప్రజాసేవలో మరింత అంకితభావంతో పనిచేయాలని పోలీసు సిబ్బందికి సూచించారు. శాంతి భద్రతల పరిరక్షణతో పాటు ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టే విధంగా విధులు నిర్వహించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో శాయంపేట పోలీస్ స్టేషన్ అధికారులు, పోలీసు సిబ్బంది పాల్గొని తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు పరస్పరం తెలియజేసుకున్నారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post