ప్రభుత్వ నిషేధిత గుట్కా, అంబర్ ప్యాకెట్ల స్వాధీనం రూ.23 వేల విలువైన పొగాకు ఉత్పత్తులు సీజ్ – కేసు నమోదు

ప్రభుత్వంచే నిషేధించబడిన గుట్కా, అంబర్ వంటి పొగాకు ఉత్పత్తుల విక్రయాలపై వరంగల్ పోలీస్ కమిషనరేట్ ప్రత్యేక దృష్టి సారించింది. పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన తనిఖీల్లో రూ.23 వేల విలువైన నిషేధిత పొగాకు ఉత్పత్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
సుబేదారి పోలీసుల సమాచారం మేరకు, బాలసముద్రం ప్రాంతంలోని ఏకశిలా పార్క్ వెనుక భాగంలో ఉన్న ఆకుల శ్రీనివాస్‌కు చెందిన కిరాణా దుకాణంలో సోమవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ నిషేధిత అంబర్ ప్యాకెట్లు, గుట్కా ప్యాకెట్లు అక్రమంగా నిల్వ ఉంచి విక్రయిస్తున్నట్లు గుర్తించారు. దీంతో సుమారు రూ.23 వేల విలువైన పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకుని సంబంధిత వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ సందర్భంగా సుబేదారి పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఎం. రంజిత్ కుమార్ మాట్లాడుతూ, ప్రజల ఆరోగ్యానికి హానికరమైన గుట్కా, అంబర్ వంటి నిషేధిత పొగాకు ఉత్పత్తుల విక్రయాలు, నిల్వలు, రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇటువంటి అక్రమ కార్యకలాపాలపై ప్రజలు పోలీసులకు సమాచారం అందించి సహకరించాలని ఆయన కోరారు.
ఈ తనిఖీల్లో ఇన్‌స్పెక్టర్ ఎం. రంజిత్ కుమార్, ఎస్‌ఐ పాణి, కానిస్టేబుల్ సత్యనారాయణ పాల్గొన్నారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post