రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో పంట అవశేషాల నిర్వహణపై అవగాహన

రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో పంట అవశేషాల నిర్వహణపై అవగాహన
వరంగల్ జిల్లా శాయంపేట మండలం హుస్సునపల్లి గ్రామంలో “రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు” కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొని పంట అవశేషాల నిర్వహణ, నేల సార సంరక్షణ మరియు పర్యావరణ పరిరక్షణపై అవగాహన పొందారు.
ఈ సందర్భంగా ముఖ్య వక్తలుగా పాల్గొన్న ప్రొఫెసర్ డా. బి. విద్యాధర్ మరియు మండల వ్యవసాయ అధికారి ప్రియదర్శిని మాట్లాడుతూ వరి, మొక్కజొన్న పంటల కోతల అనంతరం రైతులు పంట అవశేషాలను తగులబెట్టకుండా వాటిని నేలలో కలిపి భూమి సారాన్ని పెంచుకోవాలని సూచించారు.
పంట అవశేషాలను కాల్చడం వల్ల నేలలోని సేంద్రియ కార్బన్ తగ్గిపోవడం, సూక్ష్మజీవుల నష్టం, పోషకాల హ్రాసం జరుగుతుందని తెలిపారు. ముఖ్యంగా నత్రజని, భాస్వరం, పొటాష్, గంధకం వంటి ముఖ్య పోషకాలు నష్టపోతాయని వివరించారు.
పంట అవశేషాలను త్వరగా కుళ్లించేందుకు SSP + యూరియా పద్ధతి, పూసా డీకంపోజర్, NCOF ఘాజియాబాద్ వేస్ట్ డీకంపోజర్ మరియు ట్రైకోడెర్మా వంటి జీవ డీకంపోజర్ల వినియోగంపై రైతులకు ప్రాయోగిక సూచనలు అందించారు.
డా. బి. సిద్ధార్థ్ నాయక్, టీచింగ్ అసోసియేట్ మాట్లాడుతూ రైతులు పంట అవశేషాల దహనాన్ని పూర్తిగా నివారించి సుస్థిర వ్యవసాయ పద్ధతులను అవలంబించాలని కోరారు. ఏఈఓ జ్యోత్స్న రైతులకు ప్రభుత్వ పథకాల ద్వారా లభించే సాంకేతిక సహాయంపై వివరించారు.
ప్రజ్వల్ ఎన్‌జీఓ ఫీల్డ్ ఆఫీసర్ భానుమతి గ్రామస్థాయిలో రైతులకు నిరంతర మార్గదర్శకత్వం అందిస్తున్నట్లు తెలిపారు. గ్రామ సర్పంచ్ సుధాకర్ రావు మాట్లాడుతూ రైతులు శాస్త్రవేత్తల సూచనలను ఆచరణలో పెట్టి గ్రామాన్ని ఆదర్శ వ్యవసాయ గ్రామంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో రైతులు, వరంగల్ వ్యవసాయ కళాశాల విద్యార్థులు నవ్య, శైలు ఉత్సాహంగా పాల్గొని పంట అవశేషాల నిర్వహణపై తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు.
“పంట అవశేషాలు తగులబెట్టకండి – పర్యావరణాన్ని, నేల సారాన్ని కాపాడండి” అనే సందేశంతో కార్యక్రమం ముగిసింది.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post