ఓటర్ల జాబితాలతో బీజేపీ ప్రమాదకర రాజకీయాలు చేస్తోంది: ఎంపీ డాక్టర్ కడియం కావ్య

పరకాల, మే 30: ఓటర్ల జాబితాల నిర్వహణలో బీజేపీ ప్రమాదకర రాజకీయాలకు పాల్పడుతోందని, ఓటు చోరీ ప్రయత్నాలపై కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు. పరకాల ఎన్‌ఎస్‌ఆర్ కన్వెన్షన్‌లో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి బూత్ లెవల్ ఏజెంట్ల (BLAలు) అవగాహన సదస్సులో ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి, మహ్మద్ అయూబ్ తదితరులతో కలిసి ఆమె పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియ, ఓటర్ల జాబితా నిర్వహణ, బూత్ స్థాయి బాధ్యతలపై సమగ్ర అవగాహన కల్పించారు. అనంతరం మాట్లాడిన ఎంపీ కడియం కావ్య, ప్రతి బూత్ ఏజెంట్ పార్టీకి సైనికుడిలా పనిచేయాలని సూచించారు. ప్రజల సమస్యలు, ఓటర్ల వివరాలు, ప్రభుత్వ పథకాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని చెప్పారు.
ప్రజలు ఉద్యోగాలు, ఇతర కారణాలతో తరచూ నివాస ప్రాంతాలు మారడం వల్ల ఓటర్ల జాబితాలో ఖచ్చితత్వం నిలుపుకోవడం సవాల్‌గా మారుతోందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో SIR ప్రక్రియ అత్యంత కీలకమైందని తెలిపారు. 2002 తర్వాత మళ్లీ 2026లో చేపడుతున్న ఈ ప్రక్రియను పార్టీ నాయకులు, బూత్ ఏజెంట్లు అత్యంత బాధ్యతగా తీసుకోవాలని సూచించారు.
ప్రతి కుటుంబాన్ని మ్యాపింగ్ చేయడం, కొత్త ఓటర్ల నమోదు, మారిన ఓటర్ల వివరాల సవరణ, అనుమానాస్పద నమోదుల పరిశీలనపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో SIR పేరుతో ఓటర్ల జాబితాల్లో జరుగుతున్న మార్పులను గమనించాలని, తెలంగాణలో అలాంటి పరిస్థితులు రాకుండా అప్రమత్తంగా ఉండాలని అన్నారు.
ఓటు చోరీ అంశంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా పోరాటం చేస్తున్నారని పేర్కొన్న ఆమె, “మన ఓటును మనమే కాపాడుకోవాలి. ప్రతి BLA ఒక సైనికుడిలా పనిచేయాలి” అని పిలుపునిచ్చారు. బూత్ లెవల్ ఏజెంట్లు, BLOలతో కలిసి వచ్చే మూడు నెలల పాటు డోర్ టు డోర్ ప్రచారం నిర్వహించాలని సూచించారు.
ప్రతి అర్హుడికి ఓటు హక్కు కల్పించడమే లక్ష్యంగా పనిచేయాలని, ఓటర్ల జాబితానే ఎన్నికల్లో విజయానికి తొలి అడుగు అని పేర్కొన్నారు. ఇప్పటికే డివిజన్‌ల వారీగా ఇన్‌చార్జిలను నియమించామని, బూత్ స్థాయి కన్వీనర్లు, ఏజెంట్లు, ముఖ్య నాయకులతో సమావేశాలు నిర్వహించాలని సూచించారు.
అనంతరం డాక్టర్ కడియం కావ్య రూపొందించిన “బూత్ లెవల్ ఏజెంట్స్ సంక్షిప్త సమాచారం హ్యాండ్‌బుక్”ను ఆవిష్కరించి BLAలు, డివిజన్ ఇన్‌చార్జ్‌లకు అందజేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, డివిజన్ అధ్యక్షులు, నాయకులు, బూత్ అధ్యక్షులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post