తాటికొండ భరత్‌కు అంతర్జాతీయ హ్యూమన్ రైట్స్ డిఫెండర్ అవార్డు అందుకున్న వరంగల్ బిడ్డ

వరంగల్‌కు చెందిన సామాజిక కార్యకర్త తాటికొండ భరత్ అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. గోవా రాష్ట్రంలో మాండవి నది మార్గంలో క్రూయిజ్‌లో నిర్వహించిన “ఇంటర్నేషనల్ డిఫెండర్స్ అవార్డ్స్” కార్యక్రమంలో ఆయనకు “హ్యూమన్ రైట్స్ డిఫెండర్ అవార్డు” ప్రదానం చేశారు.
ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఫెడరేషన్ (ఐహెచ్ఆర్‌ఎఫ్) ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి సంస్థ నేషనల్ చైర్మన్, ఫౌండర్, హైకోర్టు అడ్వకేట్ కొంగర అనిల్ కుమార్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 2014లో కేవలం ముగ్గురితో ప్రారంభమైన ఐహెచ్ఆర్‌ఎఫ్ సంస్థ నేడు దేశవ్యాప్తంగా దాదాపు 18 వేల మంది సభ్యులతో సేవలందిస్తోందని తెలిపారు.
సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, మానవ హక్కుల ఉల్లంఘనలు, బాల్య వివాహాల నిర్మూలన, గృహహింస బాధిత మహిళలకు అండగా నిలబడటం వంటి అనేక సేవా కార్యక్రమాల్లో సంస్థ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. మానవ హక్కులకు భంగం కలిగిన సందర్భాల్లో బాధితులకు న్యాయం జరిగేలా న్యాయస్థానాలు, మానవ హక్కుల సంఘాలు, లోకాయుక్త వంటి వేదికల ద్వారా పోరాటం కొనసాగిస్తోందని పేర్కొన్నారు.
ఈ క్రమంలో తాటికొండ భరత్ సమాజ సేవలో విశేష కృషి చేసి, బాధితుల తరఫున గొంతుకగా నిలిచి అనేక సమస్యల పరిష్కారానికి కృషి చేశారని కొనియాడారు. ఆయన సేవలను గుర్తిస్తూ “హ్యూమన్ రైట్స్ డిఫెండర్ అవార్డు”తో సత్కరించడం జిల్లాకే గర్వకారణమని పలువురు అభిప్రాయపడ్డారు.
అవార్డు అందుకున్న తాటికొండ భరత్‌కు సామాజిక సంస్థల ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, మానవ హక్కుల కార్యకర్తలు, స్నేహితులు మరియు అభిమానులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post