శాయంపేట మండలం మైలారం గ్రామంలో “రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు” కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సేంద్రియ ధృవీకరణ (ఆర్గానిక్ సర్టిఫికేషన్)తో పాటు శాస్త్రీయ సేంద్రియ వ్యవసాయ నిర్వహణ పద్ధతులపై రైతులకు సమగ్ర అవగాహన కల్పించారు.
కార్యక్రమంలో ముఖ్య వక్తలుగా పాల్గొన్న డా. బి. విద్యాధర్, ప్రొఫెసర్ మరియు డా. సిద్ధార్థ నాయక్, టీచింగ్ అసోసియేట్‌లు సేంద్రియ వ్యవసాయం వల్ల నేల భౌతిక, రసాయన, జీవ లక్షణాలు మెరుగుపడతాయని వివరించారు. రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందుల అధిక వినియోగం వల్ల నేలలో సూక్ష్మజీవుల సమతుల్యత దెబ్బతిని, దీర్ఘకాలంలో దిగుబడులపై ప్రతికూల ప్రభావం పడుతుందని తెలిపారు.
జీవామృతం, ఘన జీవామృతం, వర్మీ కంపోస్ట్, గ్రీన్ మ్యాన్యూరింగ్, పంట అవశేషాల పునర్వినియోగం, బయోఫెర్టిలైజర్స్, బయోపెస్టిసైడ్స్ వినియోగం ద్వారా నేలలో సేంద్రియ కార్బన్ శాతం పెరిగి, నీటి నిల్వ సామర్థ్యం మరియు పోషక లభ్యత మెరుగుపడుతుందని వివరించారు.
సేంద్రియ ధృవీకరణ ద్వారా వ్యవసాయ ఉత్పత్తులకు అధికారిక గుర్తింపు లభించి, రైతులు జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో అధిక ధరలకు విక్రయించే అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. పీజీఎస్ (Participatory Guarantee System), ఎన్‌పీఓపీ (NPOP) విధానాల ద్వారా ధృవీకరణను సులభంగా పొందవచ్చని సూచించారు.
ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి ప్రియదర్శిని మాట్లాడుతూ వరి, మొక్కజొన్న పంటల కోతల అనంతరం పంట అవశేషాలను తగులబెట్టకుండా నేలలో కలిపి భూమి సారాన్ని పెంచుకోవాలని రైతులకు సూచించారు. పంట అవశేషాలను కాల్చడం వల్ల నేలలోని సేంద్రియ కార్బన్ తగ్గిపోవడం, సూక్ష్మజీవులు నశించడం, నత్రజని, భాస్వరం, పొటాష్, గంధకం వంటి పోషకాలు నష్టపోతాయని తెలిపారు.
పంట అవశేషాలను త్వరగా కుళ్లించేందుకు ఎస్‌ఎస్‌పీ + యూరియా పద్ధతి, పూసా డీకంపోజర్, ఎన్‌సీఓఎఫ్ ఘాజియాబాద్ వేస్ట్ డీకంపోజర్, ట్రైకోడెర్మా వంటి జీవ డీకంపోజర్ల వినియోగంపై రైతులకు ప్రాయోగిక సూచనలు అందించారు.
కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి అన్వేష్, గ్రామ సర్పంచ్ దివ్య, ప్యాక్స్ చైర్మన్ తిరుపతి రెడ్డి పాల్గొని రైతులకు ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలు, సేంద్రియ వ్యవసాయ ప్రోత్సాహక కార్యక్రమాల గురించి వివరించారు. వ్యవసాయ విద్యార్థులు గీత, జుహా అల్మీన్ కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.
పెద్ద సంఖ్యలో రైతులు హాజరై శాస్త్రవేత్తల సూచనలను ఆసక్తిగా విని, సేంద్రియ వ్యవసాయాన్ని ఆచరణలోకి తీసుకురావాలని సంకల్పించారు. నేల ఆరోగ్యం పరిరక్షణ, ఆహార భద్రత, పర్యావరణ సమతుల్యత కోసం సేంద్రియ వ్యవసాయం అత్యవసరమని నిపుణులు పేర్కొన్నారు.
Post a Comment