పరకాల: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీ ఆర్టీసీ) కార్మికులు చేపట్టిన రాష్ట్రవ్యాప్త సమ్మెకు బీజేపీ నాయకుడు డా. పగడాల కాళీ ప్రసాద్ రావు సంఘీభావం తెలిపారు. పరకాల బస్ డిపో వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొని కార్మికులకు మద్దతు ప్రకటించారు.
ఈ సందర్భంగా డా. పగడాల కాళీ ప్రసాద్ రావు మాట్లాడుతూ, ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడంలో ప్రభుత్వం, యాజమాన్యం మొండి వైఖరి అవలంబిస్తున్నాయని విమర్శించారు. ఆర్టీసీని పూర్తిస్థాయిలో ప్రభుత్వంలో విలీనం చేసి, ఉద్యోగులకు ప్రభుత్వ హోదా కల్పించాలని డిమాండ్ చేశారు. కార్మిక యూనియన్లను తక్షణమే పునరుద్ధరించాలని, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు.
రాష్ట్రవ్యాప్తంగా 90కు పైగా డిపోల వద్ద కార్మికులు శాంతియుతంగా నిరసనలు కొనసాగిస్తున్నారని, ప్రభుత్వం చర్చలకు పిలిచే వరకు సమ్మె కొనసాగుతుందని తెలిపారు. చర్చల పేరుతో ప్రభుత్వం కాలయాపన చేస్తోందని, కమిటీల పేరుతో సమస్యలను పక్కదారి పట్టిస్తోందని ఆరోపించారు.
ప్రయాణికులకు కలిగే ఇబ్బందులకు ప్రభుత్వం మరియు యాజమాన్యమే పూర్తి బాధ్యత వహించాలని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ పరకాల పట్టణ అధ్యక్షుడు గాజుల నిరంజన్, హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి దేవునూరి మేఘనాథ్, వార్డ్ కౌన్సిలర్లు కుక్కల విజయ్, ఆకుల లావణ్య శ్రీధర్, పరకాల రూరల్ మండల అధ్యక్షుడు కాసగాని రాజ్ కుమార్ గౌడ్, ఇతర నాయకులు, ఆర్టీసీ కార్మికులు పాల్గొన్నారు.
Post a Comment