హనుమకొండ జిల్లా వడ్డేపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఆకస్మిక సోదాలు నిర్వహించి సంచలన విషయాలను వెలికితీశారు. అక్రమ రిజిస్ట్రేషన్లు, లంచాల వసూళ్లపై వచ్చిన విశ్వసనీయ సమాచారంతో కార్యాలయానికి చేరుకున్న అధికారులు, సిబ్బంది ఎవరూ బయటకు వెళ్లకుండా తలుపులు మూసివేసి తనిఖీలు చేపట్టారు.
సబ్ రిజిస్ట్రార్-1, సబ్ రిజిస్ట్రార్-2 చాంబర్లలోని రికార్డులు, రిజిస్ట్రేషన్ ఫైళ్లు, నగదు లావాదేవీలకు సంబంధించిన కీలక పత్రాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. సోదాల సమయంలో సుమారు 20 మంది డాక్యుమెంట్ రైటర్లు 70 డాక్యుమెంట్లతో కార్యాలయం వద్ద వేచి ఉన్నట్లు గుర్తించారు.
గత నాలుగు నెలలుగా రిజిస్ట్రేషన్ పూర్తయిన దాదాపు 200 డాక్యుమెంట్లను డబ్బులు చెల్లించలేదని కారణంగా సంబంధిత సబ్ రిజిస్ట్రార్ అధికారులు ఇవ్వకుండా ఆలస్యం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నేరుగా రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన కొనుగోలుదారులకు కూడా అనవసర ఇబ్బందులు కలిగించారనే ఫిర్యాదులు వెలుగులోకి వచ్చాయి.
సోదాల సందర్భంగా కొంతమంది ఏజెంట్ల వద్ద నుంచి సుమారు రూ.45,500 నగదును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అలాగే, కొందరు ఏజెంట్లకు సబ్ రిజిస్ట్రార్ సూచన మేరకు రూ.1,00,000 మరియు రూ.50,000 ఇవ్వాలని పంపిన సందేశాలను కూడా అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది.
ఈ సోదాలు వరంగల్ రేంజ్ డీఎస్పీ సాంబయ్య ఆధ్వర్యంలో రెండు ప్రత్యేక బృందాల ద్వారా కొనసాగుతున్నాయి. అక్రమ వసూళ్లు జరిగాయా, నిబంధనలు ఉల్లంఘించి రిజిస్ట్రేషన్లు చేపట్టారా అనే కోణంలో అధికారులు లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.
Post a Comment