వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో ఇన్స్పెక్టర్ల బదిలీలకు రంగం సిద్ధంరెండేళ్ల తర్వాత భారీ మార్పులు… పోస్టింగ్‌లపై ఉత్కంఠ

వరంగల్, ఏప్రిల్ 3:
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇన్స్పెక్టర్ల బదిలీలకు రంగం సిద్ధమైనట్లు విశ్వసనీయ సమాచారం. ట్రాన్స్‌ఫర్‌ల జాబితా దాదాపు సిద్ధమైందని, అధికారిక ప్రకటన మాత్రమే మిగిలి ఉందని పోలీస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
గత రెండు సంవత్సరాలుగా ఒకే స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న పలువురు ఇన్స్పెక్టర్లకు ఈసారి స్థాన చలనం కలగనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఎవరికి ఎక్కడ పోస్టింగ్ దక్కుతుందన్న దానిపై అధికారుల్లో ఉత్కంఠ నెలకొంది. కీలక స్టేషన్ల పోస్టింగ్‌ల కోసం ప్రయత్నాలు చేసిన అధికారుల ఆశలు నెరవేరుతాయా లేదా అన్నది సస్పెన్స్‌గా మారింది.
ఇప్పటికే బదిలీలకు సంబంధించిన సిఫార్సుల లేఖలు ఉన్నతాధికారుల వద్దకు చేరుకున్నట్లు సమాచారం. కొన్ని ఫైళ్లపై సంతకాలు పూర్తయ్యాయని కూడా ప్రచారం జరుగుతోంది. అయితే తుది ఉత్తర్వులు ఆలస్యం కావడం పలు అనుమానాలకు తావిస్తోంది.
చివరి నిమిషం మార్పులే అడ్డంకా?
ఇన్స్పెక్టర్ల బదిలీల జాబితా ఫైనల్ దశకు చేరుకున్నప్పటికీ, కొన్ని కీలక స్టేషన్ల పోస్టింగ్‌ల విషయంలో చివరి నిమిషంలో మార్పులు జరుగుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా నగరంలోని సున్నిత ప్రాంతాల స్టేషన్లకు ఎవరిని నియమించాలన్న అంశంపై ఉన్నతస్థాయిలో చర్చలు కొనసాగుతున్నాయి.
రాజకీయ సిఫార్సులు ప్రభావం?
ఈ బదిలీల్లో రాజకీయ ప్రభావం కూడా ఉందన్న చర్చలు వినిపిస్తున్నాయి. కొందరు ప్రజాప్రతినిధులు తమకు అనుకూలమైన అధికారులను తమ ప్రాంతాలకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారని సమాచారం. ఉన్నతాధికారులను సంప్రదిస్తున్నారన్న ప్రచారం కూడా జరుగుతోంది. దీంతో కమిషనరేట్ పరిధిలో టెన్షన్ వాతావరణం నెలకొంది.
నేడా… రేపా…?
బదిలీల జాబితా ఎప్పుడైనా విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. “నేడా? రేపా?” అన్న ఉత్కంఠతో పోలీస్ వర్గాలు ఎదురుచూస్తున్నాయి. ఒకసారి ఉత్తర్వులు వెలువడితే కమిషనరేట్ పరిధిలో భారీ మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.
రెండేళ్లుగా ఒకే ప్రాంతాల్లో పనిచేస్తున్న అధికారులను మార్చడం ద్వారా పారదర్శకత, పనితీరు మెరుగుపడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద, ఈ బదిలీలు పరిపాలనా చర్య మాత్రమే కాకుండా రాజకీయ ప్రాధాన్యం సంతరించుకున్న అంశంగా మారాయి

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post