ఇళ్లలో ‘కనక వర్షం’… ఏసీబీ సోదాల్లో వెలుగులోకి భారీ అవినీతి

హనుమకొండ, ఏప్రిల్ 3:
హనుమకొండ జిల్లా వడ్డేపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారినట్లు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) నిర్వహించిన ఆకస్మిక సోదాల్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కార్యాలయంలో జరుగుతున్న అక్రమాలపై వచ్చిన సమాచారం మేరకు అధికారులు దాడులు చేపట్టగా, భారీగా నగదు, బంగారం, వెండి స్వాధీనం చేసుకున్నారు.
సోదాల సమయంలో కార్యాలయంలో సుమారు 20 మంది అనధికార ఏజెంట్లు, డాక్యుమెంట్ రైటర్లు పని చేస్తుండటం గుర్తించి అధికారులు ఆశ్చర్యానికి గురయ్యారు. వారి మొబైల్ ఫోన్లను పరిశీలించగా డిజిటల్ లావాదేవీల రూపంలో సాగుతున్న అవినీతి బహిర్గతమైంది. కేవలం ఏడాది కాలంలోనే ‘ఫోన్ పే’ ద్వారా రూ.42 లక్షల వరకు లావాదేవీలు జరిగినట్లు ఏసీబీ అధికారులు నిర్ధారించారు.
అలాగే సబ్ రిజిస్ట్రార్ అధికారులు రామనర్సింహారావు, ఆనంద్ మధ్య జరిగిన వాట్సాప్ సంభాషణలు వారి అక్రమాలకు ప్రత్యక్ష సాక్ష్యాలుగా నిలిచాయి. కార్యాలయంలో 204 డాక్యుమెంట్లు డెలివరీ కాకుండా పెండింగ్‌లో ఉండటం కూడా గమనార్హం.
ఇదిలా ఉండగా, సంబంధిత అధికారుల ఇళ్లలో నిర్వహించిన సోదాల్లో కళ్లు చెదిరే స్థాయిలో అక్రమ ఆస్తులు బయటపడ్డాయి. రూ.24.61 లక్షల నగదు, 820 గ్రాముల బంగారం, 2.60 కిలోల వెండి స్వాధీనం చేసుకున్నారు. అదనంగా, ఆనంద్ పేరిట కపిల్ చిట్స్‌లో రూ.30 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నట్లు గుర్తించారు.
కార్యాలయంలో లెక్కల్లో చూపని మరో రూ.47,450 నగదు, 70 కీలక దస్త్రాలను కూడా ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ కొనసాగుతోందని అధికారులు తెలిపారు.
ఈ సోదాలతో వడ్డేపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జరుగుతున్న అవినీతి దందా బట్టబయలైందని, మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post