జయశంకర్ భూపాలపల్లి జిల్లా:
ఈనెల 20వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు.
గురువారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్‌తో కలిసి ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి మేడిగడ్డ కాలేశ్వరం సందర్శన అనంతరం కాటారం మండలం నస్తూరుపల్లిలో రైతు భరోసా రెండో విడత నిధుల విడుదల కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు.
ఈ కార్యక్రమాలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి కేటాయించిన విధులను అధికారులు సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. నస్తూరుపల్లి బహిరంగ సభకు వచ్చే ప్రజలకు మంచినీరు, మజ్జిగ వంటి సౌకర్యాలు కల్పించాలని తెలిపారు. సభా ప్రాంగణంలో పారిశుద్ధ్య పనులు చేపట్టి పరిశుభ్రంగా ఉంచాలని డీపీవోకు సూచించారు.
ఎలాంటి అంతరాయం లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. హెలిప్యాడ్, అప్రోచ్ రోడ్డు, బారికేడింగ్ ఏర్పాట్లు చేయాలని ఆర్ అండ్ బి అధికారులకు సూచించారు. పబ్లిక్ మీటింగ్ ప్రాంతంలో సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని పీఆర్ ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశించారు.
పార్కింగ్ ప్రదేశాల్లో లైటింగ్, తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. అత్యవసర వైద్య సేవల కోసం మెడికల్ క్యాంపులు, అంబులెన్సులు, సేఫ్ హౌస్ ఏర్పాటు చేయాలని వైద్య శాఖ అధికారులకు ఆదేశించారు. అగ్నిమాపక వాహనాలు సిద్ధంగా ఉంచాలని తెలిపారు. కాళేశ్వర దేవాలయాన్ని విద్యుద్దీకరణ చేయాలని దేవాదాయ శాఖ ఈఓను ఆదేశించారు.
ఈ సందర్భంగా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులు తమ కేటాయించిన విధులపై ధృవీకరణ నివేదిక సమర్పించాలని సూచించారు. సీఎం పర్యటన నేపథ్యంలో ఈ నెల 19, 20 తేదీలలో ఇసుక లారీల రాకపోకలను నిలిపివేయాలని తెలిపారు. విధుల్లో పాల్గొనే సిబ్బందికి గుర్తింపు కార్డులు జారీ చేయాలని కలెక్టరేట్ ఏవోకు సూచించారు.
అంతకుముందు కాళేశ్వరం, నస్తూరుపల్లిలో సీఎం పర్యటనకు సంబంధించిన హెలిప్యాడ్ పనులను అధికారులు పరిశీలించారు.
ఈ సమావేశంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, ఆర్డీవో హరికృష్ణ, కాటారం డిఎస్పీ సూర్యనారాయణతో పాటు అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Post a Comment