రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలను తక్షణమే పరిష్కరించాలని తెలంగాణ ఎంప్లాయిస్ టీచర్స్ & పెన్షనర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ (టీజీఈ జేఏసీ) నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం శాయంపేట తహసీల్దార్‌కు జేఏసీ ప్రతినిధులు వినతిపత్రం సమర్పించారు.
జేఏసీ పిలుపు మేరకు మధ్యాహ్న భోజన విరామ సమయంలో తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేసిన అనంతరం మీడియాతో మాట్లాడిన నాయకులు, ఉద్యోగులకు సంబంధించిన అనేక సమస్యలు ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు కొంతవరకు సమస్యలు పరిష్కారమైనప్పటికీ, మిగిలిన సమస్యలను వెంటనే పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు.
జూన్ 2 నాటికి పీఆర్సీ ప్రకటించాలని, పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏలను విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. రిటైర్డ్ ఉద్యోగుల బిల్లులను వెంటనే క్లియర్ చేయాలని, ఉద్యోగులు మరియు పెన్షనర్లకు హెల్త్ కార్డులను అమలు చేయాలని కోరారు.
సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానం (ఓపీఎస్)ను పునరుద్ధరించాలని, 2004 సెప్టెంబర్ 1కు ముందు నోటిఫికేషన్ పొందిన ఉద్యోగులకు వెంటనే ఓపీఎస్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే వీఆర్ఏల వారసుల నియామక సమస్యను పరిష్కరించాలని, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని తెలిపారు.
జనాభా లెక్కల కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకొని ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సాధారణ బదిలీలు చేపట్టాలని, సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఈ కార్యక్రమంలో ఆర్. ప్రవీణ్ కుమార్, రాజా యుగంధర్, మనోజ్ కుమార్, డి. శ్రీనివాస్, ప్రవీణ్, సుమన్, రంజిత్, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.
Post a Comment