హైదరాబాద్, ఏప్రిల్ 18:తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి మరోసారి మొదలుకానుంది. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక ఉత్తర్వులు జారీ చేయడంతో ఎన్నికల ప్రక్రియ వేగం అందుకుంది.
గత డిసెంబర్‌లో గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు పూర్తి కాగా, అనంతరం మున్సిపల్ ఎన్నికలు కూడా నిర్వహించబడ్డాయి. ప్రస్తుతం ప్రత్యేకాధికారుల పాలనలో ఉన్న మండల, జిల్లా ప్రజాపరిషత్‌లకు ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది.
ఈ నేపథ్యంలో ఓటర్ల జాబితా తయారీకి సంబంధించి శుక్రవారం కీలక ఆదేశాలు జారీ అయ్యాయి. పరిస్థితులు అనుకూలిస్తే మే నెలలోనే పోలింగ్ నిర్వహించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలను మినహాయించి మిగతా జిల్లాల కలెక్టర్లకు ఎన్నికల నిర్వహణపై దిశానిర్దేశం చేశారు.
కేంద్ర ఎన్నికల సంఘం 2025 జూలై 10 నుంచి 2026 ఫిబ్రవరి 5 వరకు నవీకరించిన ఓటర్ల జాబితాను ఆధారంగా తీసుకుని ఈ ప్రక్రియ కొనసాగనుంది. నియోజకవర్గాల వారీగా అదనపు ఓటర్లను గుర్తించి, వారిని సంబంధిత పంచాయతీలు, పోలింగ్ కేంద్రాల వారీగా వర్గీకరించాలని అధికారులను ఆదేశించారు. డేటాలో లోపాలు ఉంటే ఈ నెల 23లోపు నివేదించాలని, అనంతరం ముసాయిదా జాబితా విడుదల చేసి అభ్యంతరాల స్వీకరణ తర్వాత తుది జాబితా ప్రకటించనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది.
చివరిసారిగా 2019 మేలో మూడు దశల్లో ఈ ఎన్నికలు నిర్వహించగా, గత ఏడాది జూన్‌తో ప్రజా ప్రతినిధుల పదవీకాలం ముగిసింది. అనంతరం ప్రభుత్వం ప్రత్యేకాధికారులను నియమించింది. బీసీ రిజర్వేషన్లపై న్యాయపరమైన చిక్కుల కారణంగా ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయినప్పటికీ, తాజాగా హైకోర్టు అనుమతితో రిజర్వేషన్లు ఖరారయ్యాయి.
ప్రస్తుతం రాష్ట్రంలో 566 జడ్పీటీసీ స్థానాలు, 5,773 ఎంపీటీసీ స్థానాలు ఉన్నట్లు పంచాయతీరాజ్ శాఖ వెల్లడించింది. పట్టణీకరణ కారణంగా కొన్ని గ్రామ పంచాయతీలు పురపాలికల్లో విలీనం కావడంతో ఈసారి స్థానాల సంఖ్యలో మార్పులు చోటుచేసుకున్నాయి.
ఓటర్ల జాబితా ఖరారు అనంతరం బ్యాలెట్ బాక్సుల తయారీ, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు వంటి చర్యలు చేపట్టనున్నారు. ఈ ఎన్నికలు రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారనున్నాయి. ఇప్పటికే సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లో ఆధిక్యం సాధించిన కాంగ్రెస్ పార్టీ అదే ఊపును కొనసాగించాలని చూస్తుండగా, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు కూడా వ్యూహాలను సిద్ధం చేస్తున్నాయి.
Post a Comment