తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె రెండవ రోజు కొనసాగుతున్న వేళ, వరంగల్ జిల్లా నర్సంపేటలో తీవ్ర కలకలం రేపిన ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే… నర్సంపేట ఆర్టీసీ డిపోలో బస్సు డ్రైవర్‌గా పనిచేస్తున్న కోలా శంకర్ గౌడ్, గురువారం మధ్యాహ్నం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. సమ్మెలో భాగంగా గత రెండు రోజులుగా తోటి కార్మికులతో కలిసి నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఆయన, తీవ్ర మనస్తాపానికి గురై ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
నర్సంపేట బస్టాండ్ సమీపంలో తనపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకోవడంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఘటనను గమనించిన తోటి ఆర్టీసీ సిబ్బంది వెంటనే స్పందించి, మంటలను ఆర్పి శంకర్ గౌడ్‌ను రక్షించారు.
తీవ్రంగా గాయపడిన ఆయనను వెంటనే వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపినట్లు సమాచారం.
ఈ ఘటనతో ఆర్టీసీ కార్మికుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. తమ డిమాండ్లపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదని కార్మికులు మండిపడుతున్నారు. సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Post a Comment