శాయంపేట మండలంలోని రైతు వేదికలో అంగన్వాడి కేంద్రాల్లో డిజిటల్ సేవలను బలోపేతం చేసే దిశగా 54 మంది అంగన్వాడి టీచర్లకు స్మార్ట్‌ఫోన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మహిళా శిశు సంక్షేమ శాఖ ఏర్పాటు చేసిన స్టాళ్లను ఎమ్మెల్యే సందర్శించారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్రంలోని అంగన్వాడి కేంద్రాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. అంగన్వాడి టీచర్లకు స్మార్ట్‌ఫోన్లు అందించడం ద్వారా సేవల నాణ్యత మరింత మెరుగుపడుతుందని చెప్పారు.
గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్య వివరాలను డిజిటల్ విధానంలో నమోదు చేయడం సులభతరమవుతుందని, గతంలో 16 రిజిస్టర్లలో నమోదు చేయాల్సిన పనిని ఇప్పుడు సాంకేతికత ద్వారా సులభతరం చేసినట్లు వివరించారు.
అదేవిధంగా పోషణ పక్వాడ కార్యక్రమం ద్వారా 15 రోజుల పాటు పౌష్టికాహారంపై అవగాహన కల్పించడంతో పాటు గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్య పరిస్థితులను పర్యవేక్షించనున్నట్లు తెలిపారు. ప్రతి నెల మొదటి వారంలో పిల్లల ఎత్తు, బరువులను కొలిచి డిజిటల్ యాప్‌లలో నమోదు చేయడం ద్వారా పోషకాహార లోపాలను త్వరగా గుర్తించి తగిన చర్యలు తీసుకోవచ్చని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు, అంగన్వాడి టీచర్లు, వ్యవసాయ శాఖ అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Post a Comment