పత్తిపాకలో ‘గుట్టల’ పోరు: క్రషర్, డాంబర్ ప్లాంట్‌కు గ్రామస్తుల గట్టి వ్యతిరేకత

హనుమకొండ జిల్లా శాయంపేట మండలం పత్తిపాక గ్రామంలో ప్రకృతి సంరక్షణ కోసం గ్రామస్తులు ఒక్కటై పోరాటానికి దిగారు. గ్రామ శివారులో కొనసాగుతున్న స్టోన్ క్రషర్, డాంబర్ ప్లాంట్‌ల వల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతోందని ఆరోపిస్తూ ప్రజలు సమరశంఖం పూరిస్తున్నారు. “మా ఊరి గుట్టలు మాకు కావాలి.. మా ఊపిరిని పీల్చేస్తున్న క్రషర్లు వద్దు” అంటూ గ్రామం మొత్తం రాజకీయాలకు అతీతంగా ఏకమైంది.
గ్రామ కేంద్రంలో “మన పత్తిపాక గుట్టలను కాపాడుకుందాం” అనే నినాదంతో రూపొందించిన కరపత్రాన్ని గ్రామస్తులు ఘనంగా ఆవిష్కరించారు. శ్రీ వెంకటేశ్వర స్టోన్ క్రషర్, డాంబర్ ప్లాంట్ కారణంగా ఇప్పటికే ఒక గుట్ట పూర్తిగా నాశనమైందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. భారీ బ్లాస్టింగ్‌ల వల్ల భూగర్భ జలాలు తగ్గిపోతుండగా, రాయి రప్పలు పొలాల్లోకి చేరి వ్యవసాయం తీవ్రంగా దెబ్బతింటోందని రైతులు వాపోతున్నారు.
క్రషర్ నుంచి వెలువడుతున్న ధూళి తాటి చెట్లపై పేరుకుపోవడంతో కల్లు గీత వృత్తి సంక్షోభంలో పడిందని, సమీప కుంటలు ధూళి, రసాయనాలతో కలుషితమవడంతో చేపల పెంపకం కూడా తగ్గుముఖం పట్టిందని గ్రామస్తులు పేర్కొన్నారు.
ఇప్పటికే ఉన్న పరిశ్రమలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో, ‘పెద్దగుట్ట’పై కొత్త క్రషర్ ఏర్పాటు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న వార్తలపై గ్రామంలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ ప్రయత్నాలను ఏకగ్రీవంగా అడ్డుకుంటామని ప్రజలు హెచ్చరిస్తున్నారు.
ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ చిట్టి రెడ్డి రాజిరెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఘంట శ్యాంసుందర్ రెడ్డి మాట్లాడుతూ, సహజ వనరుల పరిరక్షణ కోసం గ్రామ ప్రతినిధులు చేపట్టిన పోరాటం ఆదర్శప్రాయమని అన్నారు. పర్యావరణ నిపుణులు ఈ ప్రాంతాన్ని సందర్శించి పరిస్థితులను పరిశీలించాలని కోరారు.
ఇప్పటికే జిల్లా కలెక్టర్, రెవెన్యూ అధికారులకు వినతిపత్రాలు అందజేసినట్లు గ్రామస్తులు తెలిపారు. తక్షణమే క్షేత్రస్థాయి విచారణ చేపట్టి క్రషర్, డాంబర్ ప్లాంట్ కార్యకలాపాలను నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు. రైతులు భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేకపోయినా బలవంతంగా ప్రాజెక్టులు తీసుకురావడం సరికాదని నాయకులు స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన రైతులు, యువకులు, వివిధ పార్టీల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ఐక్యతను చాటుకున్నారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post