నేతన్నల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ధ్యేయం: ముగిసిన గ్రామ సభలు

హనుమకొండ, ఏప్రిల్ 1:
తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు హనుమకొండ జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన గ్రామ సభలు విజయవంతంగా ముగిశాయి. ఈ సందర్భంగా చేనేత మరియు జౌళి శాఖ ద్వారా అమలవుతున్న సంక్షేమ పథకాలపై నేతన్నలకు అవగాహన కల్పించినట్లు సహాయ సంచాలకులు ఎం. విజయలక్ష్మి తెలిపారు.
జిల్లాలో చేనేత రుణమాఫీ పథకం కింద 113 మంది కార్మికులకు సంబంధించిన రూ. 51.30 లక్షల రుణాలను మాఫీ చేసి వారి ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. ముఖ్యంగా శాయంపేట గ్రామానికి చెందిన 45 మంది నేతన్నలకు రూ. 9 లక్షల మేర లబ్ధి చేకూర్చినట్లు పేర్కొన్నారు.
పొదుపు పథకం (థ్రిఫ్ట్ ఫండ్) కింద కార్మికుడు 8 శాతం పొదుపు చేస్తే, ప్రభుత్వం అదనంగా 16 శాతం వాటాను జమ చేస్తూ సామాజిక భద్రత కల్పిస్తున్నట్లు వివరించారు. అలాగే నేతన్న భద్రత (బీమా) పథకం ద్వారా ప్రమాదవశాత్తు కార్మికుడు మరణించిన పక్షంలో కుటుంబానికి రూ. 5 లక్షల బీమా అందేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
ఇక వేతన ప్రోత్సాహకం (నేతన్నకు భరోసా) పథకం కింద జిల్లాలో 782 మంది కార్మికులకు రూ. 24.06 లక్షలు విడుదల చేసినట్లు వెల్లడించారు. ఇందులో శాయంపేట గ్రామానికి చెందిన 97 మంది కార్మికులకు రూ. 3,25,500 వేతన ప్రోత్సాహకం అందించినట్లు చెప్పారు.
చేనేత కార్మికుల ఆర్థిక పురోభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం ఈ పథకాలను అమలు చేస్తోందని, అర్హులైన నేతన్నలు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఎం. విజయలక్ష్మి కోరారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post