హనుమకొండ జిల్లా శాయంపేట మండలం పత్తిపాక గ్రామ శివారులో నిర్వహిస్తున్న శ్రీ వెంకటేశ్వర స్టోన్ క్రషర్ మరియు అనుమతులు లేని డాంబర్ ప్లాంట్ పర్యావరణాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయని పత్తిపాక గ్రామ ఉపసర్పంచ్ తుడుం రాజు మరియు వార్డు సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్లాంట్లను తక్షణమే మూసివేయాలని వారు డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రకృతి సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉన్నప్పటికీ, కొందరు ధనార్జనే లక్ష్యంగా అక్రమంగా క్రషర్ మరియు డాంబర్ ప్లాంట్ నిర్వహిస్తూ గ్రామ ప్రజల జీవన విధానాన్ని ప్రమాదంలోకి నెడుతున్నారని ఆరోపించారు. గ్రామ శివారులో జరుగుతున్న భారీ బోర్ బ్లాస్టింగ్‌ల వల్ల భూమి తీవ్రంగా కంపించిపోతూ గ్రామంలోని ఇళ్ల గోడలకు పగుళ్లు ఏర్పడుతున్నాయని తెలిపారు. ఏ క్షణాన ఏ గోడ కూలిపోతుందోనన్న భయంతో ప్రజలు రాత్రుళ్లు నిద్రపోవడానికి కూడా భయపడుతున్న పరిస్థితి నెలకొందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పేలుళ్ల సమయంలో రాళ్లు ఎగిరి పడటం వల్ల పంట పొలాలు ధ్వంసమవుతున్నాయని, మరోవైపు క్రషర్ మరియు డాంబర్ ప్లాంట్ నుండి వెలువడుతున్న దుమ్ము, ధూళి కారణంగా పంటలు దెబ్బతింటున్నాయని చెప్పారు. ఆకులపై ధూళి పేరుకుపోవడం వల్ల కిరణజన్య సంయోగ క్రియ జరగక పంట దిగుబడులు తగ్గుతున్నాయని తెలిపారు. అలాగే అనుమతులకు మించి గుట్టను తవ్వడం వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.
డాంబర్ ప్లాంట్ నుండి వెలువడుతున్న విషపూరిత పొగ కారణంగా పశువులు, రైతులు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని, శబ్ద కాలుష్యం కూడా గ్రామ ప్రజలకు తీవ్ర ఇబ్బందులను కలిగిస్తోందని వారు తెలిపారు. ఒకప్పుడు పచ్చని చెట్లతో కళకళలాడిన గుట్టను నిర్వాహకులు పూర్తిగా తవ్వేసి భూమి అడుగుభాగం వరకు తీసుకెళ్లారని ఆరోపించారు.
ఇంత జరుగుతున్నప్పటికీ మైనింగ్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మరియు రెవెన్యూ శాఖ అధికారులు స్పందించకపోవడం పట్ల గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గ్రామ పంచాయతీ పాలకవర్గం, ఉపసర్పంచ్‌తో పాటు 11 మంది వార్డు సభ్యులు ప్రజలతో కలిసి పలుమార్లు అభ్యర్థించినా చర్యలు తీసుకోలేదని తెలిపారు.
ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ మరియు సంబంధిత ఉన్నతాధికారులు స్వయంగా స్పందించి క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి క్రషర్, డాంబర్ ప్లాంట్‌ను తక్షణమే మూసివేయాలని వారు డిమాండ్ చేశారు. లేదంటే గ్రామ ప్రజలతో కలిసి టెంట్ వేసి రిలే నిరాహార దీక్షలు చేపట్టి పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు నాలికె వీరప్రతాప్, పోతుగంటి ప్రమీల సారయ్య, గజ్జి రాజు, అంకేశ్వరపు సాయి లక్ష్మి మొగిలి, కొడిమాల మహేందర్, గజ్జి రమేష్, గడ్డమీది హారతి కరుణాకర్, చిట్టిరెడ్డి పద్మ జంగారెడ్డి, ఐరబోయిన స్వప్న రాజు, కందగట్ల ప్రవీణ్ కుమార్, తుడుం స్రవంతి రాజు తదితరులు పాల్గొన్నారు.
Post a Comment