ప్రభుత్వ శాఖలు ఇకపై తప్పనిసరిగా ఎలక్ట్రిక్ వాహనాలను (ఈవీలు) మాత్రమే కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కాలుష్య రహిత రవాణా వ్యవస్థను లక్ష్యంగా పెట్టుకుని ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.
రవాణా శాఖకు సంబంధించిన అంశాలపై మంత్రి పొన్నం ప్రభాకర్ మరియు శాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కోర్ అర్బన్ ఏరియా పరిధిలోని ప్రభుత్వ శాఖలు అద్దెకు తీసుకునే వాహనాలు కూడా ఎలక్ట్రిక్ వాహనాలే ఉండాలని ఆయన స్పష్టం చేశారు.
రవాణా శాఖలో ప్రస్తుతం కొనసాగుతున్న మాన్యువల్ విధానాలకు స్వస్తి చెప్పి, అన్ని సేవలను పూర్తిగా ఆన్‌లైన్ విధానంలో నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే ఆర్‌టీవో కార్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగకుండా, వెంటనే సొంత భవనాల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.
రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ప్రజల్లో అవగాహన పెంచే కార్యక్రమాలు చేపట్టాలని సీఎం తెలిపారు. ఈ క్రమంలో షార్ట్ ఫిల్మ్‌ల ద్వారా రోడ్డు భద్రతపై ప్రచారం చేయాలని అధికారులకు సూచించారు.
అలాగే శంషాబాద్ సమీపంలో ప్రతిపాదిత హైస్పీడ్ రైలు కారిడార్ ప్రారంభమయ్యే ప్రాంతంలో ఆధునాతన బస్ టెర్మినల్ నిర్మాణానికి స్థలం కేటాయిస్తామని, అందుకు సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
Post a Comment