జిల్లా కేంద్రాల చుట్టూ రింగ్ రోడ్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయాలి: సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణలోని ప్రధాన జిల్లా కేంద్రాలన్నింటి చుట్టూ రింగ్ రోడ్లు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రాల్లోకి భారీ వాహనాలు ప్రవేశించకుండా నియంత్రించడంతో పాటు సరకు రవాణా వాహనాలు వేగంగా ప్రయాణించేందుకు రింగ్ రోడ్లు ఎంతో ఉపయోగపడతాయని ఆయన పేర్కొన్నారు.
రోడ్లు–భవనాల శాఖ పురోగతిపై జరిగిన సమీక్షా సమావేశంలో సీఎం ఈ సూచనలు చేశారు. ఈ సమావేశంలో రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరియు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇప్పటికే జిల్లా కేంద్రాల సమీపంలో ఉన్న రోడ్లను అనుసంధానించి రింగ్ రోడ్లుగా అభివృద్ధి చేయాలని సీఎం సూచించారు.
అలాగే జాతీయ రహదారులతో రింగ్ రోడ్లను అనుసంధానించే అంశంపై సమగ్ర అధ్యయనం చేయాలని అధికారులకు ఆదేశించారు. హైదరాబాద్ – విజయవాడ ఎక్స్‌ప్రెస్ వే నుండి నాగార్జునసాగర్‌కు చేరుకునేలా గ్రీన్‌ఫీల్డ్ రహదారి నిర్మాణంపై కూడా అధ్యయనం చేయాలని తెలిపారు.
ఇప్పటికే నిర్మాణంలో ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జ్‌లు (ఆర్వోబీలు), రైల్వే అండర్ బ్రిడ్జ్‌లు (ఆర్‌యూబీలు) పనులను త్వరగా పూర్తి చేయాలని సీఎం సూచించారు. అవసరమైన కొత్త ఆర్వోబీలు, ఆర్‌యూబీల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు తెలిపారు.
అదే విధంగా బోధన ఆసుపత్రులు మరియు ఇతర పెద్ద ఆసుపత్రుల నిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post