ప్రగతి సింగారం గ్రామంలో కామ్రేడ్ కర్ర వెంకటరెడ్డి స్తూపావిష్కరణ – ప్రథమ వర్ధంతి సభ ఘనంగా నిర్వహణ

ప్రగతి సింగారం గ్రామంలో అమరజీవి కామ్రేడ్ కర్ర వెంకటరెడ్డి స్మారకార్థం స్తూపావిష్కరణ కార్యక్రమం మరియు ప్రథమ వర్ధంతి సభను శుక్రవారం (20-03-2026) ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చిలుకల రాజన్న అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా ఎంసీపీఐ(యు) జాతీయ ప్రధాన కార్యదర్శి మద్దికాయల అశోక్ ఓంకార్ ముఖ్య అతిథిగా హాజరై స్తూపాన్ని ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ, కామ్రేడ్ కర్ర వెంకటరెడ్డి ఆశయాలను సాధించేందుకు ప్రతి ఒక్కరూ ఉద్యమించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.
కామ్రేడ్ వెంకటరెడ్డి 1982లో ఎంసీపీఐ పార్టీలో చేరి మరణించే వరకు పలు కీలక బాధ్యతలు నిర్వర్తిస్తూ, అనేక ప్రజా ఉద్యమాలలో చురుకుగా పాల్గొన్నారు. గ్రామ అభివృద్ధి కోసం రహదారులు, మంచినీటి వసతులు, వాటర్ ట్యాంక్ నిర్మాణం వంటి పనుల కోసం ఆయన చేసిన కృషి విశేషమని కొనియాడారు.
దేవాదుల ప్రాజెక్టు లిఫ్ట్ అంశంలో జరిగిన పోరాటంలో కీలక పాత్ర పోషించి, చివరకు సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం సాధించడంలో ఆయన నిరంతరం శ్రమించారని గుర్తు చేశారు. అదేవిధంగా శాయంపేట మండలాన్ని వరంగల్ జిల్లాలో కొనసాగించేందుకు జరిగిన ఆందోళనల్లో కూడా ముందుండి పోరాడిన నాయకుడిగా ఆయనను అభివర్ణించారు.
గ్రామంలో విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణం, సంఘ భవనాల ఏర్పాటు వంటి అభివృద్ధి కార్యక్రమాల్లోనూ ఆయన విశేష సేవలు అందించినట్లు పేర్కొన్నారు. రైతాంగ, సామాజిక ఉద్యమాల్లో ఎప్పుడూ ముందుండే వ్యక్తిగా, అన్యాయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించని పోరాట యోధుడిగా ఆయన నిలిచారని అన్నారు.
ఈ సందర్భంగా ఎంసీపీఐ(యు) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి గాధగొని రవి మాట్లాడుతూ, కామ్రేడ్ వెంకటరెడ్డి లక్ష్యం సమాన సమాజ నిర్మాణమని, అందరికీ కూడు, గూడు, గుడ్డతో పాటు ఉచిత విద్య, వైద్యం అందే సమాజం కోసం ఆయన పోరాడినట్లు తెలిపారు. రైతులకు గిట్టుబాటు ధరలు, అప్పు మాఫీ కోసం ఆయన చేసిన పోరాటం చిరస్మరణీయమని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంసీపీఐ(యు) పొలిట్ బ్యూరో సభ్యులు వెల్లేపు ఉపేందర్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గోనే కుమారస్వామి, కన్నం వెంకన్న, మంద రవి, పెద్దరపు రమేష్, జిల్లా కార్యదర్శి ఎన్. హంసారెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు మాస్ సావిత్రి, గడ్డం నాగార్జున, కర్ర రాజిరెడ్డి, నీల రవీందర్, జిల్లా కమిటీ సభ్యులు ఉస్మాన్, బుచ్చయ్య, ఓదయ్య, కిషన్, భద్రయ్య, శ్రీనివాసరావు తదితరులు పాల్గొని కామ్రేడ్ వెంకటరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
కార్యక్రమానికి వివిధ రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రజలు హాజరై కామ్రేడ్ కర్ర వెంకటరెడ్డికి ఘన నివాళులు అర్పించారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post