పత్తిపాకలో స్టోన్ క్రషర్‌కు వ్యతిరేకంగా రైతుల ఆందోళన – అనుమతి రద్దు చేయాలంటూ డిమాండ్

హనుమకొండ జిల్లా శాయంపేట మండలం పత్తిపాక గ్రామంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న శ్రీ వెంకటేశ్వర స్టోన్ క్రషర్‌కు వ్యతిరేకంగా రైతులు, గ్రామ ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. అనుమతి లేకుండా స్టోన్ క్రషర్ ఏర్పాటు చేయడం తక్షణమే నిలిపివేయాలని, ఇప్పటికే ఉన్న అనుమతులను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు.
గ్రామ పరిసర ప్రాంతాల్లో అనుమతి లేని స్టోన్ క్రషర్లు పుట్టగొడుగుల్లా పెరుగుతున్నాయని, నల్లరాయి క్వారీలకు అనుబంధంగా మైనింగ్ మాఫియా భారీ లాభాలు పొందుతున్నారని రైతులు ఆరోపించారు. ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకుల బినామీల పేర్లతో నిబంధనలు పాటించకుండా క్రషర్లు ఏర్పాటు చేస్తున్నారని వారు పేర్కొన్నారు.
నిబంధనల ప్రకారం స్టోన్ క్రషర్లు, హాట్ మిక్స్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలంటే గనుల శాఖ, విద్యుత్ శాఖ (ఈపీడీసీఎల్), కాలుష్య నియంత్రణ మండలి, రెవెన్యూ శాఖలు, మండల మరియు గ్రామ అధికారుల అనుమతులు తప్పనిసరిగా ఉండాలని తెలిపారు. అయితే జిల్లాలో అనేక చోట్ల ఈ అనుమతులు లేకుండానే క్రషర్లు నడుస్తున్నాయని విమర్శించారు.
శాయంపేట డివిజన్ పరిధిలో అధికారికంగా 13 నల్లరాయి క్వారీలకు మాత్రమే అనుమతి ఉన్నప్పటికీ, ప్రస్తుతం 57 వరకు క్వారీలు నడుస్తున్నాయని, వాటిలో చాలావరకు అనధికారికంగా క్రషర్లు నిర్వహిస్తున్నారని చెప్పారు. శాయంపేట మండలంలో తొమ్మిది స్టోన్ క్రషర్లకు మాత్రమే చట్టబద్ధ అనుమతులు ఉండగా, మరో 20 వరకు అనుమతి లేకుండానే నడుస్తున్నాయని వెల్లడించారు.
అనుమతి లేని క్రషర్ల వల్ల కాలుష్యం తీవ్రంగా పెరిగి, తాగునీటి వనరులు దెబ్బతింటున్నాయని, ప్రజలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని గ్రామస్థులు తెలిపారు. పత్తిపాక, పరిసర ప్రాంతాల్లో కొందరు శ్వాసకోశ సంబంధిత వ్యాధులకు గురవుతున్నట్లు వారు కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.
కొంతమంది నిర్వాహకులు ఒకే అనుమతితో అనేక చోట్ల క్రషర్లు నడుపుతూ, అక్రమంగా కంకర, బేబీ చిప్స్ రవాణా చేస్తున్నారని ఆరోపించారు. అలాగే ప్రభుత్వ భూములను ఆక్రమించి భారీగా రాయి నిల్వలు ఉంచుతున్నారని తెలిపారు.
ఇప్పటికైనా అధికారులు స్పందించి అనుమతి లేకుండా నడుస్తున్న స్టోన్ క్రషర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉపసర్పంచి తుడుం రాజు, వార్డు సభ్యులు నాలికె వీర ప్రతాప్, పోతుగంటి ప్రమీల సారయ్య, గజ్జి రాజు, అంకేశ్వరపు సాయి లక్ష్మి, కొడిమాల మహేందర్, గజ్జి రమేష్, గడ్డమీది హారతి కర్ణాకర్, చిట్టి రెడ్డి పద్మ, జంగారెడ్డి, ఐరబోయిన స్వప్న రాజు, కందగట్ల ప్రవీణ్ కుమార్, తుడుం స్రవంతి రాజు తదితరులు విజ్ఞప్తి చేశారు.
ఈ ఆందోళనకు బీఆర్‌ఎస్ గ్రామ నాయకులు తుడుం వెంకటేష్, అంకేశ్వరపు మొగిలి, అలాగే రైతులు పల్లెబోయిన రామరాజు, భాస్కర్, రవి, సుధాకర్, గాజ కిష్టయ్య, కిషోర్, పెద్దమనిషి రాజయ్య, ఐరబోయిన రాజు, తుడుం మహేందర్ తదితరులు మద్దతు తెలిపారు.
రైతులు, గ్రామ ప్రజలు కలిసి “పర్యావరణాన్ని కాపాడాలి – అనుమతి లేని క్రషర్లు వెంటనే మూసివేయాలి” అంటూ నినాదాలు చేస్తూ తమ నిరసనను తెలియజేశారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post