భారత సైన్యంలో చేరాలనుకునే యువతకు శుభవార్త. 2027 నియామక సంవత్సరానికి సంబంధించిన అగ్నివీర్ కేటగిరీలలో నియామక ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు తమ దరఖాస్తులను ఆన్‌లైన్ ద్వారా సమర్పించేందుకు నమోదు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది.
ఫిబ్రవరి 13, 2026న విడుదలైన నోటిఫికేషన్ ప్రకారం, సికింద్రాబాద్ ఆర్మీ రిక్రూటింగ్ ఆఫీస్ పరిధిలోని తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ జిల్లాల్లో ఆదిలాబాద్ నుంచి యాదాద్రి భువనగిరి వరకు ఉన్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.
ఈ నియామకాలు అగ్నివీర్ జనరల్ డ్యూటీ, టెక్నికల్, క్లర్క్/స్టోర్ కీపర్ టెక్నికల్, ట్రేడ్స్‌మన్ (10వ తరగతి), ట్రేడ్స్‌మన్ (8వ తరగతి) వంటి విభాగాల్లో జరుగనున్నాయి. అభ్యర్థులు తమ అర్హతల ప్రకారం గరిష్టంగా రెండు కేటగిరీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఈసారి అగ్నివీర్ నియామకానికి గరిష్ట వయోపరిమితిని 21 నుండి 22 సంవత్సరాలకు పెంచడం జరిగింది.
దరఖాస్తులు కేవలం అధికారిక వెబ్‌సైట్ www.joinindianarmy.nic.in� ద్వారా మాత్రమే స్వీకరించబడతాయి. దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ ఏప్రిల్ 1, 2026గా నిర్ణయించారు. ఆన్‌లైన్ కామన్ ఎంట్రన్స్ పరీక్ష (CEE) జూన్ 1 నుండి జూన్ 15, 2026 మధ్య నిర్వహించబడనుంది. ఈ పరీక్ష తెలుగు సహా మొత్తం 13 భాషల్లో నిర్వహించబడటం విశేషం.
ITI, డిప్లొమా, NCC అర్హతలు కలిగిన అభ్యర్థులకు అదనపు మార్కులు లభించనున్నాయి. అడ్మిట్ కార్డులు కూడా అదే వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవాలి. అభ్యర్థులు తాజా సమాచారాన్ని తెలుసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్‌ను తరచూ పరిశీలించడం, అలాగే తమ ఈ-మెయిల్ ఐడీలను చెక్ చేయడం అవసరం.
ఇక, నియామక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించబడుతుందని అధికారులు స్పష్టం చేశారు. ఎవరైనా మధ్యవర్తులు లేదా మోసగాళ్లు ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పినా నమ్మవద్దని హెచ్చరించారు. కేవలం ప్రతిభ, కృషి ఆధారంగా మాత్రమే ఎంపిక జరుగుతుందని తెలిపారు.
మరిన్ని వివరాల కోసం సికింద్రాబాద్ ఆర్మీ రిక్రూటింగ్ ఆఫీస్‌ను 040-27740059 నంబర్ ద్వారా సంప్రదించవచ్చు.
Post a Comment